యుద్ధ పరిష్కారానికి కృషి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్యలో కాకుండా... దాని పరిష్కారంలో భాగమవుతామని భారత్ స్పష్టం చేసింది. ఎవరో ఒకరి పక్షం వహించబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది.
మీ సమరం మామూలుది కాదు
మానవత్వం, విలువలకు సవాలిది
ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ
శాంతియత్నానికి మద్దతు కోరిన జెలెన్‌స్కీ
హిరోషిమా: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్యలో కాకుండా... దాని పరిష్కారంలో భాగమవుతామని భారత్ స్పష్టం చేసింది. ఎవరో ఒకరి పక్షం వహించబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి ముఖాముఖి భేటీ అయ్యారు. హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు ఇందుకు వేదికైంది. ప్రత్యేక ఆహ్వానితుడిగా మోదీ ఈ సదస్సుకు రాగా... యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా... తమకు మద్దతివ్వాల్సిందిగా ఆయా దేశాలను కోరడానికి జెలెన్‌స్కీ వచ్చారు. ఈ సందర్భంగా వీరిద్దరి భేటీ జరిగింది. యుద్ధ పరిష్కారానికి సాధ్యమైనంతగా భారత్ కృషి చేస్తుందని, ఆ దిశగా ఉక్రెయిన్‌కు అండగా ఉంటుందని జెలెన్‌స్కీకి మోదీ భరోసా ఇచ్చారు. ‘‘గత ఏడాదిన్నర కాలంలో అనేక సార్లు మనం ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎట్టకేలకు ప్రత్యక్షంగా ఒకరినొకరం కలుసుకునే అవకాశం ఇప్పటికి చిక్కింది. యుద్ధ బాధ మా అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. ఉక్రెయిన్‌లో జరుగుతున్నది మామూలు యుద్ధం కాదు. ప్రపంచంపై అనేక కోణాల్లో ప్రభావం చూపుతోంది. భారత్ తరఫునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ సంఘర్షణకు పరిష్కారం కనుక్కోవడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని మీకు మాటిస్తున్నా. నా దృష్టిలో ఇది రాజకీయ, ఆర్థిక ఘర్షణ కాదు. మానవత్వం, విలువలకు సవాలు ఈ యుద్ధం’’ అని జెలెన్‌స్కీతో మోదీ అన్నారు.
భారత్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు
రష్యాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు కూడగట్టడానికి వచ్చిన జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి అండగా నిలుస్తున్నందుకు, మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయానికి మోదీ పిలుపు
పర్యావరణ మార్పులు, నీటి ఎద్దడి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రత వంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే తృణ ధాన్యాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మోదీ జీ7 దేశాలకు సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యామ్నాయ విధానంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా పేదలందరికీ ఆహార భద్రతను కల్పించడానికి సమీకృత విధానాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల అధిక దిగుబడికి ఉపయోగపడే ఎరువులపై గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవాలన్న మనస్తత్వం తగదని పేర్కొన్నారు. అయితే, ఏ దేశం పేరునూ మోదీ నేరుగా ప్రస్తావించలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తే అది ప్రజాస్వామ్యం, అభివృద్ధికి మధ్య వారధిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూతనివ్వడం అన్ని దేశాల ప్రాధాన్యంగా మారాలని సూచించారు. ఆహార పదార్థాల వృథాను అరికట్టాలని నొక్కి చెప్పారు. సుస్థిర ఆహార భద్రత అన్ని దేశాల సమష్టి బాధ్యత కావాలని సూచించారు.
హిరోషిమాలో మహాత్ముడి విగ్రహావిష్కరణ
హరిత హైడ్రోజన్, సెమీకండక్టర్, విద్య, నైపుణ్యం, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. జపాన్ ప్రధాని కిషిదతో మోదీ దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. జపాన్‌లో భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్న జపనీస్ ప్రముఖులను ప్రధాని మోదీ కలుసుకున్నారు. హిరోషిమాలో అణుబాంబు స్మారక స్తూపానికి సమీపంలోనే శాంతిదూత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు