ఐరాసను సంస్కరించాల్సిందే!

ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించకుంటే ఐక్యరాజ్య సమితి(ఐరాస), భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 22 May 2023 06:38 IST

శాంతి పరిరక్షణలో ఆ సంస్థ వైఫల్యాలపై నిలదీసిన భారత ప్రధాని మోదీ
భద్రతా మండలి విస్తరణకు డిమాండ్‌
జీ-7 వేదికపై ప్రసంగం

హిరోషిమా: ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించకుంటే ఐక్యరాజ్య సమితి(ఐరాస), భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ సంస్థల్లో భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం కోసం ఐరాస ఏర్పడినప్పటికీ వివిధ వేదికలపై ఆయా అంశాలను ఎందుకు చర్చించాల్సి వస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది విశ్లేషణకు సంబంధించిన అంశం. ఐరాస ఉన్నది ఎందుకు? ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంతో ఏర్పడిన ఈ వేదిక.. ఘర్షణలను ఎందుకు విజయవంతంగా నిరోధించలేకపోతోంది? కనీసం ఉగ్రవాదం అనే పదానికి నిర్వచనాన్ని కూడా ఆమోదించలేకపోతోంది ఎందుకు? ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకుంటే... గత శతాబ్దంలో ఆవిర్భవించిన ఈ సంస్థలు 21వ శతాబ్ద పరిస్థితులకు అనుగుణంగా లేవని స్పష్టమవుతోంది. ప్రస్తుత వాస్తవికతకు అవి అద్దంపట్టడం లేదు. అందుకే ఐరాస సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దక్షిణార్ధ గోళ దేశాల గళం కూడా ఆ సంస్థల్లో వినపడాలి. లేదంటే, ఘర్షణలకు ముగింపు పలకాలని మాత్రమే మాట్లాడుకోగలం. దీంతో ఐరాస, భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయి’ అని భారత ప్రధాని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాలి

రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంపై జీ7 సదస్సులో మోదీ మాట్లాడుతూ... ఆ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని రాజకీయ, ఆర్థిక కోణంలో కాకుండా మానవత, మానవీయ కోణంలో చూడాలన్నారు. అన్ని దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐరాస నిబంధనలను గౌరవించాలన్నారు. పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గుర్తించాలని సూచించారు.


పపువా న్యూ గినియా ప్రధాని పాదాభివందనం

విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. గినియా దేశ ప్రధాని జేమ్స్‌ మరాపే.. మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అక్కడి ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయం వద్ద మోదీతో కరచాలనం చేశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని