శ్వేతసౌధం వద్ద ట్రక్కుతో దాడియత్నం.. నిందితుడు తెలుగు సంతతికి చెందిన యువకుడు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 24 May 2023 06:20 IST

 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ ట్రక్కులో వచ్చిన సాయివర్షిత్‌ కందుల వైట్‌హౌస్‌ ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ట్రక్కుకు నాజీ జెండా కట్టి ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. యువకుడిని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధ్యక్షుడు బైడెన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికాలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అయినట్లుగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లోని ఖాతాల ద్వారా అతని వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని