US Debt ceiling Crisis: ఆర్థికసంక్షోభం ముంగిట అమెరికా?

అమెరికా రుణపరిమితిని పెంచడంపై అధ్యక్షుడు జోబైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీల మధ్య సోమవారం రాత్రి వైట్‌హౌస్‌లో జరిగిన చర్చల్లో అంగీకారమేదీ కుదరలేదు.

Updated : 24 May 2023 09:44 IST

రుణ పరిమితి పెంపుపై కుదరని అంగీకారం
జీతభత్యాలు, పింఛన్లు నిలిచిపోయే పరిస్థితి

వాషింగ్టన్‌: అమెరికా రుణపరిమితిని పెంచడంపై అధ్యక్షుడు జోబైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీల మధ్య సోమవారం రాత్రి వైట్‌హౌస్‌లో జరిగిన చర్చల్లో అంగీకారమేదీ కుదరలేదు. బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారు కాగా, మెకార్థీ ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువ సభలో రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది కనుక మెకార్థీ సభాపతి పదవి నిర్వహిస్తున్నారు. సెనెట్‌లో డెమోక్రాట్లదే మెజారిటీ. మరో 10 రోజుల్లో, అంటే జూన్‌ 1కల్లా రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో సహా విదేశాలు కొనుగోలు చేసిన బాండ్లకు సైతం చెల్లింపులు జరపలేకపోతుంది. అలా జరిగితే అమెరికానే కాక యావత్‌ ప్రపంచాన్నీ ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక మంత్రి జెనెట్‌ యెలెన్‌ ఇటీవల కాంగ్రెస్‌కు రాసిన లేఖలో హెచ్చరించారు. వార్షిక బడ్జెట్‌ కేటాయింపులకు ఆరేళ్లపాటు ఏటా 1 శాతం చొప్పున కోత పెట్టి డబ్బు ఆదా చేయాలని రిపబ్లికన్లు డిమాండ్‌ చేస్తుంటే, అధ్యక్షుడు బైడెన్‌ 2024 బడ్జెట్‌ను 2023 స్థాయిలోనే కొనసాగిస్తామంటున్నారు.

2025 బడ్జెట్‌ వ్యయాన్ని 1 శాతానికి మించి పెంచబోమని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రక్షణ, రక్షణేతర వ్యయాలను 2023 స్థాయిలోనే పట్టి నిలిపితే 9,000 కోట్ల డాలర్లు ఆదా అవుతాయనీ, పదేళ్లలో లక్ష కోట్ల డాలర్లు మిగులుతాయని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. అత్యంత సంపన్నులపైనా, కొన్ని బడా కంపెనీలపైనా పన్నులు పెంచడం ద్వారా బడ్జెట్‌ లోటును కొంతవరకు భర్తీచేసుకోవచ్చని బైడెన్‌ ప్రతిపాదించగా, మెకార్థీ ససేమిరా అన్నారు. వారానికి కనీసం 20 గంటలు పనిచేస్తున్నవారికే మెడికెయిడ్‌ కింద ఆరోగ్య బీమా కల్పించాలని రిపబ్లికన్లు డిమాండ్‌ చేస్తుంటే, కొవిడ్‌ వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల అల్పాదాయ వర్గాలు ఉపాధి కోల్పోయిన ప్రస్తుత సమయంలో పని గంటల విషయంలో పట్టుపట్టకూడదని డెమోక్రాట్లు అంటున్నారు. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రుణాలు తీసుకోవడానికి అనుమతిస్తే ప్రతిగా డెమోక్రాట్లు తమ విధానాలను మార్చుకోవాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. దానికి పాలక డెమోక్రాట్లు ఏమాత్రం సిద్ధంగా లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని