ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సన్నిహితురాలైన సీనియర్‌ నాయకురాలు, గతంలో ఆయన మంత్రివర్గంలో మానవహక్కుల మంత్రిగా పనిచేసిన షిరీన్‌ మజారీ (72) మంగళవారం పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి రాజీనామా చేశారు.

Published : 24 May 2023 05:27 IST

పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నాయకురాలు

ఇస్లామాబాద్‌: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సన్నిహితురాలైన సీనియర్‌ నాయకురాలు, గతంలో ఆయన మంత్రివర్గంలో మానవహక్కుల మంత్రిగా పనిచేసిన షిరీన్‌ మజారీ (72) మంగళవారం పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి సైతం తాను వైదొలగుతున్నట్లు ప్రకటించిన షిరీన్‌.. మే 9న ఇమ్రాన్‌ మద్దతుదారులు సున్నితమైన రక్షణ వ్యవస్థలపై దాడులకు దిగి, తగులబెట్టడాన్ని ఖండించారు. ఈ హింసాకాండకు సంబంధించిన కేసులోనే పోలీసులు షిరీన్‌ను ఆమె ఇంటి నుంచి అరెస్టు చేసి జైలులో పెట్టారు. విడుదల అనంతరం ఇమ్రాన్‌ పార్టీకి, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆమె ప్రకటించడం గమనార్హం. పాక్‌లో అధికారపక్షంతో అమీతుమీ అంటూ రాజకీయ పోరు సాగిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌కు షిరీన్‌ రాజీనామా తొలి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మీడియాతో మాట్లాడిన షిరీన్‌.. ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత చెలరేగిన హింసను తీవ్రంగా ఖండించారు. ఇస్లామాబాద్‌ హైకోర్టులోనూ తాను ఇదే వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. ‘‘నేను అరెస్టు కావడం నా ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. నాకు నా కుటుంబం ఎంతో ముఖ్యం’’ అన్నారు. ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత పాక్‌లో చెలరేగిన హింసకు సంబంధించి షిరీన్‌ మజారీతోపాటు 13 మంది పీటీఐ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఇమ్రాన్‌ తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్‌ 8 వరకు బెయిల్‌

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో మార్చి నెలలో జరిగిన హింసకు సంబంధించి నమోదైన ఎనిమిది కేసుల్లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం జూన్‌ 8వ తేదీ వరకు బెయిల్‌ మంజూరు చేసింది.  ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానంలో మంగళవారం హాజరయ్యేందుకు ఇమ్రాన్‌ లాహోర్‌ నుంచి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని