టీ20 తీరున ద్వైపాక్షిక సంబంధాలు

అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్‌-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి.

Published : 25 May 2023 05:50 IST

భారత్‌-ఆస్ట్రేలియా స్నేహంపై నరేంద్ర మోదీ వ్యాఖ్య
బెంగళూరులో ఆస్ట్రేలియా కాన్సులేట్‌.. త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆల్బనీస్‌
ముగిసిన ప్రధానమంత్రి 3 దేశాల పర్యటన

సిడ్నీ/దిల్లీ: అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్‌-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి. రెండు దేశాల మధ్య విద్యార్థులు, పరిశోధకుల రాకపోకలు, వలసలకు సంబంధించి కీలక ఒప్పందాలు అక్షరరూపం దాల్చాయి. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో ప్రధాని మోదీ బుధవారం వివిధ అవగాహనా ఒప్పందాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరికి సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సాకారం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పునరుత్పాదక రంగంలో భారీ అవకాశాలను సృష్టించే గ్రీన్‌ హైడ్రోజన్‌ కార్యదళంపై విధివిధానాల రూపకల్పనకు గాను ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ, ఆల్బనీస్‌లు మీడియాతో మాట్లాడారు. ‘‘పరస్పర విశ్వాసం, గౌరవంతో పాటు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య సజీవ వారధులుగా నిలుస్తున్నార’’ని ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘టీ20 మోడ్‌లోకి ప్రవేశించాయ’ంటూ క్రికెట్‌ పరిభాషలో వివరించారు. ఏడాది వ్యవధిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో ఆరుసార్లు భేటీ కావడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘గత ఏడాది భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై దృష్టి సారించాం. ఇది రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సహకారంలో నూతన అవకాశాలకు బాటలు వేస్తుంద’ని పేర్కొన్నారు.

ఆల్బనీస్‌కు మోదీ ఆహ్వానం..

ఈ ఏడాది భారత్‌లో జరిగే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పోటీలను వీక్షించేందుకు రావాల్సిందిగా ఆల్బనీస్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులను మోదీ ఆహ్వానించారు. అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను చూడొచ్చని చెప్పారు. బెంగళూరులో త్వరలో తమ దేశ కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ వెల్లడించారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఆస్ట్రేలియా గవర్నర్‌ జనరల్‌ డేవిడ్‌ హర్లే, విపక్ష లిబరల్‌ పార్టీ నేత పీటర్‌ డ్యూటన్‌, ఇతర ప్రముఖులతోనూ విడివిడిగా భేటీ అయ్యారు.

వేర్పాటువాదులపై చర్యలకు ఆస్ట్రేలియా ప్రధాని హామీ

‘ఆస్టేలియాలో ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై జరుగుతోన్న దాడులు, వేర్పాటువాద(ఖలిస్థాన్‌)శక్తుల కార్యకలాపాల గురించి ఆల్బనీస్‌, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఆ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హానికలిగించే చర్యలను మేం ఏ మాత్రం అంగీకరించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్బనీస్‌ మరోసారి హామీ ఇచ్చారు’ అని మోదీ వెల్లడించారు.

త్రివర్ణాల్లో మెరిసిన ఒపెరా హౌస్‌

ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకుని సిడ్నీలోని ప్రసిద్ధ ఒపెరాహౌస్‌, హార్బర్‌ బ్రిడ్జ్‌లను భారత జాతీయ పతాకంలోని మూడు వర్ణాలతో మెరిసేలా అలంకరించారు. ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైందని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఆతిథ్యమిచ్చిన ఆ దేశ ప్రజలు, ప్రధాని ఆల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారంతో ప్రధాని మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. జీ7, క్వాడ్‌ సదస్సుల్లో పాల్గొనేందుకు శుక్రవారం జపాన్‌ వెళ్లిన ఆయన ఆ తర్వాత పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు