సంక్షిప్త వార్తలు(8)

దెబ్బతిన్న, ఇన్‌ఫెక్షన్‌ సోకిన కణాలు తమను తాము నాశనం చేసుకుంటాయి. ఈ అంతర్గత ‘ఆత్మాహుతి’ వ్యవస్థ గురించి కీలక వివరాలను పరిశోధకులు తాజాగా వెలుగులోకి తెచ్చారు.

Updated : 26 May 2023 06:13 IST

కణ స్వీయ నాశనంలో ఈ ప్రొటీన్‌ది కీలక పాత్ర

దిల్లీ: దెబ్బతిన్న, ఇన్‌ఫెక్షన్‌ సోకిన కణాలు తమను తాము నాశనం చేసుకుంటాయి. ఈ అంతర్గత ‘ఆత్మాహుతి’ వ్యవస్థ గురించి కీలక వివరాలను పరిశోధకులు తాజాగా వెలుగులోకి తెచ్చారు. కణ రక్షణ పొర ఛిద్రం కావడంలో నింజురిన్‌-1 అనే ప్రొటీన్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందని తేల్చారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

కణాలు తమ జీవన చరమాంకంలో బుడగలా పగిలిపోతుంటాయని ఎక్కువ మంది భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్యాక్టీరియాకు చెందిన కొన్ని భాగాల రూపంలో వచ్చే సంకేతాలు.. చివరిదశలో ఈ ప్రక్రియను ప్రేరేపిస్తాయని వివరించారు. ఈ క్రమంలో కణంలోని రక్షణాత్మక పొరకు రంధ్రాలు ఏర్పడతాయని, వాటిగుండా కణంలోకి అయాన్లు చొచ్చుకొస్తాయని పేర్కొన్నారు. ‘‘ఈ దశలో కణం ఉబ్బిపోయి చివరకు పగిలిపోతుందని అందరూ అనుకుంటుంటారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది మేం వెలుగులోకి తెచ్చాం. బెలూన్‌లా పగిలిపోవడానికి బదులు.. నింజిరిన్‌-1 ప్రొటీన్‌ సంబంధిత కణ పొరలో విచ్ఛిన్న ప్రదేశాలను సృష్టిస్తుంది. దీనివల్ల ఆయా చోట్ల అది ఛిద్రమవుతుంది’’ అని పరిశోధకుడు సెబాస్టియన్‌ హిల్లర్‌ తెలిపారు. తొలుత ఈ ప్రొటీన్లు ఒక్కచోటుకు చేరుతాయని పేర్కొన్నారు. అవి జిప్పర్‌లా పనిచేస్తూ కణ పొరను తెరుస్తాయని వివరించారు. అంతిమంగా ఆ ప్రక్రియ కణ విచ్ఛిన్నానికి దారితీస్తుందని పేర్కొన్నారు.


ఆర్కిటిక్‌ హిమాన్ని కాపాడిన ఓజోన్‌ ఒప్పందం

దిల్లీ: భూ వాతావరణంలోని ఓజోన్‌ పొరను కాపాడటానికి 1987లో కుదిరిన మాంట్రియెల్‌ ఒప్పందం వల్ల ఆర్కిటిక్‌ ప్రాంతంలో విపరిణామాలు కనీసం కొన్నేళ్లయినా వాయిదా పడ్డాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మాంట్రియెల్‌ ఒప్పందాన్ని ఐరాసలోని ప్రతి సభ్య దేశం ఆమోదించింది. ఓజోన్‌ను దెబ్బతీస్తున్న దాదాపు 100 కృత్రిమ రసాయనాలను నియంత్రించడం దీని ఉద్దేశం.  ఓజోన్‌ పొరను క్షీణింపచేసే రసాయనాలను ఓజోన్‌ డిప్లీటింగ్‌ పదార్థాలు (ఓడీఎస్‌)గా పిలుస్తారు. వీటిని శీతల యంత్రాలు, ఇంధనాల్లో వాడుతుంటారు. వెయ్యి టన్నుల ఓడీఎస్‌లను నివారించడం వల్ల ఏడు చదరపు కిలోమీటర్ల మేర ఆర్కిటిక్‌ సముద్ర ఐస్‌ను కాపాడినట్లవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ లెక్కన వారు వాతావరణ నమూనా సిమ్యులేషన్లను ఉపయోగించి ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచు లేని తొలి వేసవి సీజన్‌ ఎప్పుడనేది విశ్లేషించారు. అది ఈ శతాబ్దం మధ్య నాటికి జరుగుతుందని తొలుత అంచనావేశారని, ఒప్పందం అమలు వల్ల కనీసం 15 ఏళ్ల మేర వాయిదా పడిందని గుర్తించారు.


‘దీపావళి సెలవు’కు న్యూయార్క్‌ అసెంబ్లీ చట్టం!

న్యూయార్క్‌: దీపావళి పర్వదినంతో పాటు చాంద్రమాన కొత్త సంవత్సరం రోజున న్యూయార్క్‌లో సెలవు ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా చట్టసభ సభ్యులు, ప్రవాస సభ్యుల చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించనుంది. ఆ రెండు రోజులను సెలవులుగా ప్రకటించేందుకు చట్టాన్ని రూపొందించాలని న్యూయార్క్‌ అసెంబ్లీ భావిస్తోంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రజల విభిన్న సంస్కృతిని గుర్తించాల్సిన అవసరం ఉందని, దీపావళి, చాంద్రమాన కొత్త సంవత్సరం రోజును సెలవు దినాలుగా ప్రకటించేందుకు గాను అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చట్టాన్ని ఆమోదిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ కార్ల్‌ హేస్టీ తెలిపారు. పాఠశాల క్యాలెండరులో అమలు చేసే విషయమై చర్చలు కొనసాగిస్తామని వివరించారు. సెలవుల కోసం ప్రతిపాదించిన బిల్లుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసే (జూన్‌ 8)లోపు ఆమోదం లభించే అవకాశాలున్నాయి.


అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఛైర్మన్‌గా సి.క్యూ.బ్రౌన్‌

వాషింగ్టన్‌: వైమానిక దళాధికారి జనరల్‌ సి.క్యూ.బ్రౌన్‌ జూనియర్‌ను తదుపరి జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్‌’లో అత్యున్నత పదవి. నల్లజాతీయుడైన బ్రౌన్‌కు చైనాకు సంబంధించి విస్తృత అవగాహన ఉంది. ఈ నియామకంతో పెంటగాన్‌లో అత్యున్నత పౌర (రక్షణ మంత్రి), మిలటరీ పదవులను ఏకకాలంలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంతతి వారు నిర్వహించినట్లవుతుంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా నల్లజాతీయుడే. ప్రస్తుత జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే పదవీకాలం ఈ ఏడాది అక్టోబరులో ముగియనుంది. ఆ తర్వాత బ్రౌన్‌ ఆ బాధ్యతలు చేపడతారు. ఆయన వాయుసేనలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. ఐరోపా, పశ్చిమాసియా, ఆసియాలో పనిచేశారు.  ఆయన ఎఫ్‌-16 యుద్ధవిమాన పైలట్‌గా కెరీర్‌ ప్రారంభించారు.


సియెర్రా లియోన్‌లో నేలకొరిగిన శతాబ్దాల నాటి వృక్షం

డాకర్‌(సెనెగల్‌): పశ్చిమాఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో జాతీయ సంపదగా గుర్తింపు పొందిన శతాబ్దాల నాటి ఓ వృక్షం నేలకొరిగింది. రాజధాని డాకర్‌లో 70 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వృక్షం తుపాను ధాటికి బుధవారం కూలిపోయింది. 400 ఏళ్ల నాటి ఈ వృక్షరాజ చిత్రం దేశ కరెన్సీ నోట్లపై కనిపిస్తుంది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సహా ఎందరో ప్రముఖులు దీన్ని సందర్శించారు. ఈ వృక్షం కూలిపోవడంపై అధ్యక్షుడు జులియస్‌ మాడ బయో విచారం వ్యక్తం చేశారు.


అంగారకుడి నుంచి సందేశం.. గ్రహాంతరవాసులు పంపినదేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంగారక గ్రహం నుంచి కోడ్‌ భాషలో వచ్చిన సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌ భూమికి చేరవేసింది. ఇలా ఇతర గ్రహాల నుంచి కోడ్‌ సమాచారం రావడం ఇదే తొలిసారి. కేవలం భూమి మీదనే జీవజాలం ఉందా? ఈ సువిశాల అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకున్నా.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన ఈ సమాచార చేరవేత. ఈ సమాచారాన్ని స్వీకరించిన జీటీవో 16 నిమిషాల్లో దాన్ని ఎర్త్‌స్టేషన్‌కు అందించింది. ఇందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  


కత్తి, తుపాకీతో దుండగుడి దాడి

 ఇద్దరు పోలీసులు సహా ముగ్గురి మృతి

టోక్యో: జపాన్‌లోని నగానోలో గురువారం ఓ దుండగుడు కత్తి, తుపాకీతో దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళను వెంబడించి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆమెను కాపాడటానికి వచ్చిన ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపాడు. గాయపడిన ఆ ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయారు.  


20 మందిని పెళ్లాడిన మత నేతపై విచారణ

ఫొనిక్స్‌: అమెరికాలో 18 ఏళ్లలోపున్న 10 మంది అమ్మాయిలు సహా 20 మందిని వివాహం చేసుకున్నట్లు రాప్పిలీ బేట్‌మాన్‌(47) అనే మత నేతపై అభియోగాలు నమోదయ్యాయి. బేట్‌మాన్‌తోపాటు అతడి అనుచరులు కొందరు బాలికలతో శృంగారం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారితో అభ్యంతరకర వీడియోలు తీసినట్లు వెల్లడించారు. ఈ కేసులో శుక్రవారం విచారణ జరగనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని