అమెరికా సంస్థలు లక్ష్యంగా చైనా హ్యాకింగ్‌

ప్రభుత్వ మద్దతు ఉన్న చైనా హ్యాకర్లు అమెరికాలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆరోపించింది.

Updated : 26 May 2023 06:08 IST

సంక్షోభ సమయాల్లో అస్త్రంగా వాడుకోవచ్చు
మైక్రోసాఫ్ట్‌ ఆందోళన

బోస్టన్‌: ప్రభుత్వ మద్దతు ఉన్న చైనా హ్యాకర్లు అమెరికాలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆరోపించింది. భవిష్యత్తులో సంక్షోభ సమయాల్లో దీన్ని అస్త్రంగా వాడుకొని అమెరికా, ఆసియా మధ్య కీలక కమ్యూనికేషన్‌లకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. గువామ్‌లో ఉన్న అమెరికా మిలటరీ స్థావరానికి చెందిన వెబ్‌సైట్‌ సహా పలు కీలక సైట్లు కూడా చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఈ హ్యాకర్లను ‘వోల్ట్‌ టైఫూన్‌’గా పేర్కొంది. వీరు 2021 మధ్య నుంచి క్రియాశీలంగా ఉన్నట్లు వెల్లడించింది. కమ్యూనికేషన్స్‌, తయారీ, యుటిలిటీ, రవాణా, నిర్మాణం, మేరిటైమ్‌, విద్య, ఐటీ రంగాల్లోని సంస్థలపై హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ, ఎఫ్‌బీఐ, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, బ్రిటన్‌లోని సంబంధిత సంస్థలు సైతం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇటీవల హ్యాకర్ల కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాయి. బహుశా హ్యాకింగ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ను కనుగొని ఉంటారని గూగుల్‌లో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడొకరు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని