పెరుగుతున్న వలసలపై బ్రిటన్‌ ఆందోళన

మారుతున్న ప్రపంచ కాలమాన పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా బ్రిటన్‌కు వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Published : 26 May 2023 04:57 IST

గతేడాది రికార్డుస్థాయిలో 6 లక్షలు

లండన్‌: మారుతున్న ప్రపంచ కాలమాన పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా బ్రిటన్‌కు వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2022లో ఈ సంఖ్య రికార్డుస్థాయిలో ఆరు లక్షలు దాటినట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించిన తాజా వివరాలు స్పష్టం చేశాయి. క్రమంగా పెరుగుతున్న వలసలు, దేశ ఆర్థికవ్యవస్థపై అవి చూపించే ప్రభావం గురించి ఇపుడు బ్రిటన్‌లో చర్చలు మొదలయ్యాయి. యూకే జాతీయ గణాంకాల కార్యాలయం గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. గతేడాది 12 లక్షల మంది బ్రిటన్‌కు రాగా, అందులో 5,57,000 మంది తిరిగి వెనక్కు వెళ్లారు. 2021లో ఈ వ్యత్యాసం 5 లక్షలు ఉండగా, మరుసటి ఏడాదికి మరో లక్ష పెరిగింది. బ్రిటన్‌ ప్రస్తుత జనాభా 6.7 కోట్లకు పైగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు తోడు కరోనా వైరస్‌ ఆంక్షల తొలగింపు సైతం గతేడాది వలసల పెరుగుదలకు కారణమై ఉంటుందని విశ్లేషించారు. సాధారణంగా బ్రిటన్‌కు ఉపాధి నిమిత్తం వచ్చేవారితోపాటు ఉక్రెయిన్‌ యుద్ధం, హాంగ్‌కాంగ్‌పై బిగిసిన చైనా పట్టు వంటి పరిణామాల కారణంగా తరలివచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, ఇతర వర్గాలవారు 1,60,000 మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. గతేడాది నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులకు బ్రిటన్‌ జారీ చేసిన వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని