సంపన్న దేశాల్లోనే ‘ఆధునిక బానిసత్వం’ ఎక్కువ!

ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

Published : 26 May 2023 05:02 IST

భారత్‌, చైనాల్లో అత్యధిక సంఖ్యలో..
‘వాక్‌ ఫ్రీ’ తాజా నివేదికలో వెల్లడి

ఐరాస: ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌’ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ రూపొందించిన 172 పేజీల నివేదిక బుధవారం విడుదల అయింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో బానిసత్వం ఉన్నట్లు అంచనా వేసింది. నివేదిక రూపకల్పనకు విస్తృతస్థాయిలో ఇంటింటి సర్వేలు, బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ‘వాక్‌ ఫ్రీ’ వెల్లడించింది. ‘‘ఆధునిక బానిసత్వం సమాజంలోని ప్రతి అంశానికీ వ్యాపించింది’’ అని వాక్‌ ఫ్రీ వ్యవస్థాపక డైరెక్టర్‌ గ్రేస్‌ ఫారెస్ట్‌ తెలిపారు. నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలివే..

* బలవంతపు చాకిరీ లేదా బలవంతపు వివాహాలతో ‘ఆధునిక బానిసత్వం’లో జీవిస్తున్నవారిలో ఎక్కువమంది జీ-20లోని ఆరు దేశాల్లోనే ఉన్నారు. సంఖ్యాపరంగా.. అత్యధికంగా భారత్‌లో ఇలాంటివారు 1.1 కోట్ల మంది ఉండగా.. చైనా (58 లక్షల మంది), రష్యా (19 లక్షలు), ఇండొనేసియా (18 లక్షలు), తుర్కియే (13 లక్షలు), అమెరికా (11 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

* 2021 ఆఖరునాటికి 5 కోట్ల మంది ‘ఆధునిక బానిసత్వం’లో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఐఎల్‌వో, ఐవోఎంలతోపాటు ‘వాక్‌ ఫ్రీ’ గత ఏడాది సెప్టెంబరులో రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఇందులో 2.8 కోట్ల మంది బలవంతపు చాకిరీలో, 2.2 కోట్ల మంది బలవంతపు వివాహాలతో మగ్గుతున్నారు. 2016తో పోలిస్తే ఇలాంటివారి సంఖ్య కోటి వరకు పెరిగింది.

* ‘ఆధునిక బానిసత్వం’ ఉత్తర కొరియా, ఎరిట్రియా, మారిటేనియా, సౌదీ అరేబియా, తుర్కియాల్లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి దేశంలోనూ అనేక రంగాల్లో బలవంతపు చాకిరీ కనిపిస్తోందని, బాల కార్మికులు ఎక్కువగా కోకా బీన్స్‌ సాగులో ఉన్నారని నివేదిక తెలిపింది.

* 2015లో ఐరాస నిర్దేశించిన లక్ష్యాల్లో.. 2030 నాటికి ఆధునిక బానిసత్వం, మానవ అక్రమరవాణా, నిర్బంధ చాకిరీ వంటివాటిని తుడిచిపెట్టడం ఒకటి. ప్రభుత్వాల చర్యల్లో స్తబ్దత, ఇలాంటివారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరింత సమయం పడుతుంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆధునిక బానిసత్వాన్ని అరికట్టేందుకు చర్యలను వేగవంతం చేయాలని నివేదిక సూచించింది. దీనికి రాజకీయ సంకల్పం కీలకమని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని