India-Australia: భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా షాక్‌

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులకు షాకిచ్చాయి. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

Updated : 27 May 2023 08:59 IST

వీసాల జారీపై నిషేధంతో ఇబ్బందులు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులకు షాకిచ్చాయి. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులు స్వీకరించవద్దని ఫెడరేషన్‌ యూనివర్సిటీ, వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్‌ ఏజెంట్లకు తాజాగా సూచనలు జారీ చేశాయి. ఈ అంశంపై ఇప్పటికే వ్యక్తిగతంగానూ మెయిల్స్‌ పంపినట్లు ఫెడరేషన్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ రాష్ట్రాల విద్యార్థులు చేస్తున్న దరఖాస్తుల్లో చాలావరకు వాస్తవమైనవి కాదని, మోసపూరితంగా ఉన్నాయని ఆస్ట్రేలియా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించడం వల్లే వీసాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. భారత్‌ నుంచి వచ్చిన వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గత పదేళ్లలో ఇదే గరిష్ఠమని, మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 25 శాతం మోసపూరితంగా ఉన్నాయని అక్కడి వర్గాలు వెల్లడించాయి. కనీసం రెండు నెలలపాటు ప్రస్తుత నిషేధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వలసలు, విద్య, నైపుణ్య మార్పిడులను పెంపొందించుకునేందుకు భారత్‌, ఆస్ట్రేలియాలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్‌ కోవన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వోలోంగాంగా, టొరెన్స్‌ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలన్నీ తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు వాటికి అనుబంధంగా కొందరు ఏజెంట్లను నియమించుకుంటాయి. వారి నుంచి వచ్చిన మెయిల్స్‌ ఆధారంగా విద్యార్థులకు వీసాలు మంజూరవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని విశ్వవిద్యాలయాలు ఏజెంట్లకు సూచించినట్లు ‘ది సిడ్నీ హెరాల్డ్‌’ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని