రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హత్యే.. మా లక్ష్యం

ఉక్రెయిన్‌ తయారు చేసుకున్న కిల్‌ లిస్ట్‌ (హత్యల జాబితా)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేరు అగ్రభాగాన ఉందట. ఈ విషయాన్ని ఆ దేశ సైనిక నిఘా విభాగానికి చెందిన వాదిమ్‌ స్కిబిట్స్కీ తెలిపారు.

Updated : 27 May 2023 08:21 IST

మా ‘కిల్‌ లిస్ట్‌’లో తొలి పేరు రష్యా అధ్యక్షుడిదే
ఉక్రెయిన్‌ నిఘా అధికారి వెల్లడి

మాస్కో, కీవ్‌: ఉక్రెయిన్‌ తయారు చేసుకున్న కిల్‌ లిస్ట్‌ (హత్యల జాబితా)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేరు అగ్రభాగాన ఉందట. ఈ విషయాన్ని ఆ దేశ సైనిక నిఘా విభాగానికి చెందిన వాదిమ్‌ స్కిబిట్స్కీ తెలిపారు. ‘‘పుతిన్‌ను హత్య చేయాలని కీవ్‌ అనుకుంటోంది. ఎందుకంటే యుద్ధంలో ఏం జరగాలనేది ఆయనే నిర్ణయిస్తున్నారు. మా హత్యల జాబితాలో తొలివరుసలో ఆయన పేరే ఉంది. ఈ విషయం పుతిన్‌కూ తెలుసు. మేం చేరువగా వస్తున్నామని ఆయన గుర్తించారు. అలాగే సొంత వ్యక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోతాననే భయంతో జీవిస్తున్నారు. మా జాబితాలో పుతిన్‌తో పాటు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌, రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. పుతిన్‌ను టార్గెట్‌ చేయడం కష్టసాధ్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా సురక్షిత ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. కానీ, ఇటీవల తరచూ బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు’’అంటూ సంచలన  వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌ ఏం చేయనుందో తెలుసునని, వారి ప్రయత్నాలు నెరవేరవని అన్నారు. ‘‘మమ్మల్ని నమ్మండి. మా భద్రతా సిబ్బందికి వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలో తెలుసు’అని బదులిచ్చారు.

జెలెన్‌స్కీ ఇంటిని అమ్మేస్తాం: రష్యా

రష్యా ఆక్రమిత క్రిమియాలోని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫ్లాట్‌ త్వరలో వేలానికి రానుంది. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్‌ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఈ ప్రాంతంలో ఉన్న 57 ఆస్తులను జాతీయం చేయాలని క్రిమియాలోని రష్యా కనుసన్నల్లో పనిచేస్తున్న స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో జెలెన్‌స్కీ సతీమణి ఒలెనా పేరునున్న రూ.6 కోట్ల విలువైన మూడు పడకగదుల ఫ్లాట్‌ కూడా ఉంది. దీన్ని 2013లో జెలెన్‌స్కీ దంపతులు కొనుగోలు చేశారు. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించి తన భూభాగంలో కలుపుకున్న సంగతి తెలిసిందే.

నిప్రోలో ఆస్పత్రిపై దాడి: ఇద్దరి మృతి

ఉక్రెయిన్‌లోని నిప్రో నగరంలో ఓ ఆస్పత్రిపై రష్యా చేసిన క్షిపణి దాడిలో ఇద్దరు మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు. ఈ ఆస్పత్రి సైనిక స్థావరం కాదని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. దాడిని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా అమానవీయంగా ప్రవర్తిస్తోందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని