పరుగుతో వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మెరుగు

వ్యాయామంలో భాగంగా నడివయసులో పరిగెత్తడం వల్ల.. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయని అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Updated : 28 May 2023 04:55 IST

దిల్లీ: వ్యాయామంలో భాగంగా నడివయసులో పరిగెత్తడం వల్ల.. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయని అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. యవ్వన దశలోకి వచ్చాక కొత్తగా ఏర్పడ్డ నాడీ కణాలను ఒక కీలక నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు తేల్చారు. వయసు మీద పడే క్రమంలో ‘ఎపిసోడిక్‌ మెమరీ’ నిర్వహణకు ఈ నెట్‌వర్క్‌ అవసరం. గతంలో జరిగిన అనుభవాలను, వాటితో ముడిపడ్డ సమయం, ప్రదేశం, భావాలతో సహా గుర్తుచేసుకోవడానికి ఎపిసోడిక్‌ మెమరీ దోహదపడుతుంది.

వార్ధక్యం వల్ల క్రమంగా విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది. మెదడులోని హిప్పోక్యాంపల్‌ పరిమాణంలో మార్పులే ఇందుకు కారణం. హిప్పోక్యాంపస్‌, దానిపక్కన ఉన్న కార్టిస్‌లు.. అభ్యాసం, జ్ఞాపకశక్తికి చాలా కీలకం. వార్ధక్యం వల్ల మెదడులోని పెరిహైనల్‌, ఎంట్రోహైనల్‌ కార్టెక్స్‌ నుంచి హిప్పోక్యాంపస్‌కు వచ్చే సమాచారం క్షీణతకు గురి కావడం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. సందర్భం, భిన్న అంశాలను గుర్తుపెట్టుకోవడంలో దోహదపడే ‘కాంటెక్స్ట్‌వల్‌ మెమరీ’లో ఈ భాగాలకు ప్రమేయం ఉంది. దీర్ఘకాల పరుగుల వల్ల.. యవ్వనంలో పుట్టుకొచ్చిన  న్యూరాన్లు పెరగడంతోపాటు పెరిహైనల్‌ సంధానతలు బలోపేతమయ్యాయి. దీనికితోడు ఆ కొత్త న్యూరాన్లకు ఎంటిరోహైనల్‌ కార్టిస్‌ల తోడ్పాటు పెరిగింది. ఫలితంగా విషయగ్రహణ ప్రక్రియలో వాటి భాగస్వామ్యం మెరుగైంది. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతను ఇవి దూరం చేశాయి. ఒకే తరహా ఘటనల మధ్య వైరుధ్యాన్ని గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని