స్నాతకోత్సవంలో ప్రతి విద్యార్థికి.. వెయ్యి డాలర్ల నగదు బహుమతి

అమెరికాలోని బోస్టన్‌ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ స్నాతకోత్సవానికి ప్రారంభ వక్తగా విచ్చేసిన బిలియనీర్‌ రాబర్ట్‌ హేల్‌ తన ప్రసంగంలో భాగంగా చేసిన ఓ ప్రకటనకు విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు.

Published : 29 May 2023 05:32 IST

2,500 మందికి సేవాపాఠం నేర్పిన బిలియనీర్‌

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ స్నాతకోత్సవానికి ప్రారంభ వక్తగా విచ్చేసిన బిలియనీర్‌ రాబర్ట్‌ హేల్‌ తన ప్రసంగంలో భాగంగా చేసిన ఓ ప్రకటనకు విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ ప్రాంగణంలోని 2,500 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ వెయ్యి డాలర్ల (రూ.82,564) చొప్పున నగదు మొత్తాన్ని తాను అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాబర్ట్‌ మాట మేరకు.. విద్యార్థులు అందరికీ రెండు కవర్ల చొప్పున పంపిణీ చేశారు. అందులో ఓ కవరుపైన ‘గిఫ్ట్‌’ అని, మరో కవరుపై ‘గివ్‌’ అని రాసి ఉంది. ప్రతి కవరులో 500 డాలర్లు ఉన్నాయి. విద్యార్థులు ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోకముందే రాబర్ట్‌ హేల్‌ ప్రసంగం కొనసాగించారు. ‘‘మీరంతా ఎంతో కష్టకాలాన్ని దాటుకొని వచ్చారు. మీ కృషిని చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో కలిసి పంచుకునేందుకే రెండు బహుమతుల చొప్పున ఇచ్చాం. మొదటిది మీకు, రెండోది ఆ డబ్బు అవసరమున్న ఇతరులకు ఇవ్వండి. మీరు రేపటి సమాజానికి ప్రతీకలు. దొరికినదాంట్లో కొంత ఇతరులకు ఇస్తే మీ జీవితం మరింత సంతోషంగా సాగుతుంది’’ అని రాబర్ట్‌ ప్రసంగాన్ని ముగించారు. అమెరికాలో గ్రానైట్‌ టెలికమ్యూనికేషన్స్‌ సంస్థను నిర్వహిస్తున్న ఈయన తన సంపదలో ఎక్కువ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని