సౌందర్య చికిత్సతో ఫంగల్‌ మెనింజైటిస్‌

అమెరికాలో ఫంగల్‌ మెనింజైటిస్‌ మరణాలు కలవరపెడుతున్నాయి. సౌందర్య చికిత్సలే దీనికి కారణమని భావిస్తున్నారు.

Updated : 29 May 2023 05:42 IST

కలవరపెడుతున్న మరణాలు

వాషింగ్టన్‌: అమెరికాలో ఫంగల్‌ మెనింజైటిస్‌ మరణాలు కలవరపెడుతున్నాయి. సౌందర్య చికిత్సలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, మెక్సికో దేశాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌వో) విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాజాగా అమెరికాలోని ఇద్దరు వ్యక్తులు ఫంగల్‌ మెనింజైటిస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ మెక్సికోలో లైపోసక్షన్‌ చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చికిత్స ద్వారా చర్మం దిగువున పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. ఈ సమయంలో ఫంగస్‌ వాళ్ల శరీరంలోకి చొరబడుతుంది. కొన్నిరోజులకు కణాలను ఉబ్బిపోయేలా చేస్తుంది. దీనివల్ల మరణం ముప్పు తలెత్తవచ్చు. జనవరి నుంచి మే 13 మధ్యలో దాదాపు 200 మంది అమెరికన్లు ఈ చికిత్స కోసం మెక్సికో వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) హెచ్చరికలు జారీ చేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని తెలిపింది. మెనింజైటిస్‌ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మెడ పట్టేయడం, వాంతులు, కాంతి వైపు చూడలేకపోవడం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి కాదని సీడీసీ పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని