సంక్షిప్త వార్తలు (3)

నిద్రలేమి సమస్యలకు సాధారణంగా వాడే మందులతో గాఢనిద్ర వ్యవహారశైలి రుగ్మతను గణనీయంగా తగ్గించొచ్చని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Updated : 30 May 2023 05:26 IST

కలలకు తగ్గట్టు అరిచే రుగ్మతకు నిద్రలేమి మందుతో చికిత్స 

దిల్లీ: నిద్రలేమి సమస్యలకు సాధారణంగా వాడే మందులతో గాఢనిద్ర వ్యవహారశైలి రుగ్మతను గణనీయంగా తగ్గించొచ్చని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. డ్యుయెల్‌ ఒరెక్సిన్‌ రిసెప్టార్‌ యాంటాగోనిస్ట్స్‌ అనే ఈ ఔషధాలతో చాలా తక్కువగా దుష్ప్రభావాలు ఉంటాయని వెల్లడైంది. మౌంట్‌ సైనాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

గాఢ నిద్ర వ్యవహారశైలి రుగ్మత ఎక్కువగా 50 ఏళ్లు పైబడ్డవారిలో తలెత్తుతుంటుంది. వీరు కలలో చోటుచేసుకునే పరిణామాలకు తగ్గట్టు అప్పటికప్పుడు పెద్దగా అరవడం, అకస్మాత్తుగా కాళ్లు, చేతులు కదిలించడం, పళ్లు కొరకడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల వారికి, పక్కన నిద్రించేవారికి గాయాలవుతుంటాయి. మెదడులో టావ్‌ ప్రొటీన్‌ పేరుకుపోవడం వల్ల జరిగే నాడీక్షీణతతో ఈ రుగ్మత ఉత్పన్నమవుతుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రొటీన్‌ సాధారణంగా మెదడులోని నాడీ కణాల అంతర్గత నిర్మాణాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంటుంది. ఇది ఎక్కువగా పేరుకుపోవడం.. భవిష్యత్‌లో రాబోయే నాడీ క్షీణత సమస్యలకు తొలి సంకేతమని సైనాయ్‌ సంస్థ పరిశోధకులు పేర్కొన్నారు. డ్యుయెల్‌ ఒరెక్సిన్‌ రిసెప్టార్‌ యాంటాగోనిస్ట్‌ను రోజుకు రెండుసార్లు ఇవ్వడం వల్ల ఇలాంటివారు త్వరగా గాఢనిద్రలోకి జారుకుంటారని, కలలో వచ్చే దృశ్యాలకు తగ్గట్టు అరవడం, కాళ్లు చేతులు ఆడించడం కూడా తగ్గుతుందని తెలిపారు.


ఎక్కువ చెట్లు.. పొడవైన భవనాలతో నగరాల్లో తగ్గనున్న వేడి

దిల్లీ: గుబురైన మహావృక్షాలను పెంచడం, పరావర్తన సామర్థ్యం కలిగిన పేవ్‌మెంట్లు, సన్నటి వీధుల వెంబడి పొడవైన భవనాల నిర్మాణం ద్వారా నగరాల్లో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించొచ్చని తాజా పరిశోధన పేర్కొంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు.

నగరాల్లోని పరిస్థితుల దృష్ట్యా అవి తీవ్రస్థాయిలో వేడిని ఒడిసిపడుతుంటాయి. దీన్ని అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ (యూహెచ్‌ఐ) ఎఫెక్ట్‌గా పిలుస్తుంటారు. దీనివల్ల వేసవిలో ప్రమాదకర స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని మార్పుల వల్ల ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. భవనాలు, ఇతర మౌలిక వసతుల నుంచి వెలువడే వేడి వల్ల ఆరుబయట గాలి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. దీన్ని తగ్గించే శక్తి చెట్లకు ఉంది. సన్నటి వీధుల పక్కనే ఎత్తైన భవనాలను నిర్మించాలని కూడా వారు సూచించారు. దీనివల్ల వీధులకు నీడ లభిస్తుందని పేర్కొన్నారు. సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందించే పేవ్‌మెంట్ల వల్ల ఆరుబయట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. యూహెచ్‌ఐ వల్ల ఉష్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.


ప్లాస్టిక్‌ కాలుష్య నియంత్రణపై చర్చలు

పారిస్‌: అంతర్జాతీయంగా ప్లాస్టిక్‌ కాలుష్యానికి అంతం పలికేందుకు ఎటువంటి ఒప్పందాన్ని రూపొందించాలన్న విషయమై కసరత్తు ఊపందుకొంది. ఇందుకోసం ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రత్యేక కమిటీ సోమవారం పారిస్‌లో భేటీ అయ్యింది.  2024 చివరి నాటికి చర్చలను పూర్తి చేసేందుకు మొత్తం అయిదు సమావేశాలను నిర్వహించాల్సి ఉండగా తాజా భేటీ రెండవది. ఆర్నెళ్ల క్రితం ఉరుగ్వేలో తొలి సమావేశం జరిగింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు