రక్తపోటు పరిశీలనకు స్మార్ట్‌ఫోన్‌ సాధనం

రక్తపోటును చౌకలో, సులువుగా పర్యవేక్షించడానికి శాస్త్రవేత్తలు క్లిప్‌లాంటి సాధనాన్ని అభివృద్ధి చేశారు.

Published : 31 May 2023 04:03 IST

దిల్లీ: రక్తపోటును చౌకలో, సులువుగా పర్యవేక్షించడానికి శాస్త్రవేత్తలు క్లిప్‌లాంటి సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, ఫ్లాష్‌ను ఉపయోగించి, వినియోగదారుడి వేలి కొన భాగంలో బీపీని పరిశీలిస్తుంది. ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌తో పనిచేస్తుంది. ఈ సాధనం తయారీకి రూ.5.60 మాత్రమే ఖర్చవుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి  చేశారు. భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తే ఇది డెభ్బై పైసలకే అందుబాటులోకి వస్తుందని వారు వివరించారు. దీనివల్ల పేదవర్గాలకు రోజువారీ రక్తపోటు పర్యవేక్షణ చాలా తేలికవుతుందని పేర్కొన్నారు. నిత్యం క్లినిక్‌లకు వెళ్లలేనివారికి ఇది వరమని చెప్పారు. ఈ త్రీడీ ముద్రిత క్లిప్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకోవాలి. ఆ తర్వాత వేలి మొనతో ఈ క్లిప్‌ను వత్తాలి. ఎంతసేపు దాన్ని నొక్కాలన్నదానిపై సంబంధిత యాప్‌ దిశానిర్దేశం చేస్తుంది. ఆ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్‌ ఆన్‌ అవుతుంది. వేలి మొనను అది ప్రకాశవంతం చేస్తుంది. ఆ కాంతిని కెమెరా ఒడిసిపడుతుంది. అది స్క్రీన్‌పై ఎర్రటి వృత్తంలా కనిపిస్తుంది. దీని ఆధారంగా వేలి మొన ప్రయోగించిన ఒత్తిడిని అది కొలుస్తుంది. ఆ భాగంలోకి వచ్చి, వెళ్లిన రక్తం పరిమాణాన్ని యాప్‌ గణిస్తుంది. ఒక అల్గోరిథమ్‌.. దాన్ని రక్తపోటుకు సంబంధించిన వివరాలుగా మార్చి అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని