సంక్షిప్త వార్తలు(3)

మన పాలపుంత గెలాక్సీలో చాలా సర్వసాధారణంగా కనిపించే ఎం డ్వార్ఫ్‌ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న మూడో వంతు గ్రహాల్లో ద్రవ రూపంలో నీరు ఉండొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 01 Jun 2023 05:02 IST

మరుగుజ్జు నక్షత్రాల వద్ద ఆవాసయోగ్య గ్రహాలు

దిల్లీ: మన పాలపుంత గెలాక్సీలో చాలా సర్వసాధారణంగా కనిపించే ఎం డ్వార్ఫ్‌ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న మూడో వంతు గ్రహాల్లో ద్రవ రూపంలో నీరు ఉండొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. అక్కడ జీవుల మనుగడకు అనువైన వాతావరణం ఉండొచ్చని తెలిపింది. తాజా టెలిస్కోపు డేటా ఆధారంగా  వర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణ చేశారు. ఎం డ్వార్ఫ్‌ నక్షత్రాలు ఒకింత చిన్నగా ఉంటాయి. వీటికి వేడి తక్కువగా ఉంటుంది. సూర్యుడితో పోలిస్తే ఈ తారల ద్రవ్యరాశి దాదాపు సగం మేర మాత్రమే ఉంటుంది. ఈ మరుగుజ్జు నక్షత్రాల చుట్టూ వందల కోట్ల గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. వీటిలో మూడింట రెండొంతుల గ్రహాల్లో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు. మూడో వంతు గ్రహాలు మాత్రం ఆవాసయోగ్య ప్రాంతం (గోల్డీలాక్స్‌ జోన్‌)లో ఉండొచ్చని తెలిపారు. అవి కూడా కోట్లలో ఉంటాయని చెప్పారు.  


అధిక రక్తపోటుతో విషయగ్రహణ లోపాలు

దిల్లీ: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే అధిక రక్తపోటుకు భావోద్వేగ సమస్యలు, విషయ గ్రహణ సామర్థ్యంలో లోపాలతో సంబంధం ఉన్నట్లు జపాన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువగా ఉప్పును తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణ వ్యవస్థకు కొన్నిరకాల లిపిడ్‌ పదార్థాలకు మధ్య అవాంఛిత సిగ్నలింగ్‌ మొదలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల మెదడు పనితీరులో ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. రక్తపోటు, ద్రవాల సమతౌల్యతను కాపాడటంలో యాంజియోటెన్సిన్‌-2 (ఏఎన్‌జీ-2) కీలక పాత్ర పోషిస్తుంది. ఏటీ1 అనేది దీని గ్రాహకం. శరీరానికి చాలా ముఖ్యమైన లిపిడ్‌ పదార్థం ప్రోస్టాగ్లాండిన్‌ ఈ2 (పీజీఈ2), దాని గ్రాహకం ఈపీ1కు ఏఎన్‌జీ-2-ఏటీ1కు అధికరక్తపోటుతో సంబంధం ఉందని మునుపటి పరిశోధనల్లో వెల్లడైంది. ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల తలెత్తే అధిక రక్తపోటు కారణంగా ఈ రెండు వ్యవస్థల మధ్య అనవసరంగా సంకేతాల మార్పిడి జరుగుతుందని తాజాగా జపాన్‌ పరిశోధకులు తేల్చారు. దీనివల్ల భావోద్వేగపరమైన విషయ గ్రహణ సామర్థ్యంలో లోపాలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. తీవ్ర మతిమరుపు కూడా తలెత్తుతున్నట్లు వివరించారు.


అవును.. నేను బైసెక్సువల్‌

అందాలభామ సంచలన ప్రకటన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది 72వ విశ్వసుందరి పోటీలకు ఫిలిప్పీన్స్‌ తరఫున పోటీ పడుతున్న అందాలభామ (మిస్‌ యూనివర్స్‌ ఫిలిప్పీన్స్‌) మిషెల్లీ మార్కెజ్‌ డీ సంచలన ప్రకటన చేశారు. తన లైంగికత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెడుతూ.. తాను బైసెక్సువల్‌ (ద్విలింగ స్వభావి) అని స్పష్టం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 12 ఏళ్ల క్రితమే తాను ఈ విషయాన్ని గుర్తించినట్లు మిషెల్లీ చెప్పారు. ఇటీవల ఈమె చిన్ననాటి ఫొటోలు  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అందులో మిషెల్లీ చాలావరకు అబ్బాయిల దుస్తుల్లో కనిపించడంతో ఆమె ‘గే’ అంటూ.. తన లింగత్వంపై పలురకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ ఊహాగానాలపై తాజాగా మిషెల్లీ స్పష్టత ఇచ్చారు. ‘‘అన్నిరకాల అందాలకు నేను ఆకర్షితురాలినవుతా. ఈ విషయాన్ని మే 13న జరిగిన ఫిలిప్పీన్స్‌ అందాల పోటీల్లోనే చెప్పాలనుకున్నా. కానీ, అది సరైన సమయం కాదనిపించింది. నా స్నేహితుల్లో చాలామందికి ఈ విషయం తెలుసు’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని