ఉ.కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్న ఉత్తర కొరియా ప్రయత్నం విఫలమయింది. మల్లిగ్యాంగ్‌ - 1 ఉపగ్రహంతో.. కొత్తగా అభివృద్ధి చేసిన చొల్లిమా-1 రాకెట్‌ బుధవారం ఉదయం 6:37 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

Published : 01 Jun 2023 04:16 IST

సముద్రంలో కూలిపోయిన రాకెట్‌

సియోల్‌: నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్న ఉత్తర కొరియా ప్రయత్నం విఫలమయింది. మల్లిగ్యాంగ్‌ - 1 ఉపగ్రహంతో.. కొత్తగా అభివృద్ధి చేసిన చొల్లిమా-1 రాకెట్‌ బుధవారం ఉదయం 6:37 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. అయితే రెండు దశల అనంతరం ఇంజిన్‌లు థ్రస్ట్‌ను కోల్పోవడంతో సముద్రంలో రాకెట్‌ కూలిపోయిందని ఉ.కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఉ.కొరియా పెంపొందించుకుంటున్న సాంకేతికతపై సరిహద్దు దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌ ఆందోళన వ్యక్తం చేశాయి.

దక్షిణ కొరియాలో గందరగోళం

ఉ.కొరియా ప్రయోగం నేపథ్యంలో ద.కొరియా రాజధాని సియోల్‌లో గందరగోళం ఏర్పడింది. బుధవారం ఉదయం 6.37 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లగా.. సుమారు 14 నిమిషాల అనంతరం సియోల్‌ ప్రజల సెల్‌ఫోన్లకు అధికారులు అత్యవసర సందేశాలు పంపించారు. కారణాన్ని పేర్కొనకుండా.. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. కాసేపటికే భద్రత మంత్రిత్వ శాఖ ఆ సందేశాలు ఓ పొరపాటని ప్రకటించింది. ఉ.కొరియా ప్రయోగించిన ఏదైనా క్షిపణుల శకలాలు దక్షిణ కొరియా భూభాగంలో పడే ప్రమాదముందని భావిస్తేనే ఇలాంటి అలెర్ట్‌లు పంపాలని సూచించినట్లు సైన్యం వెల్లడించింది. అదీ కూడా 5 నిమిషాల లోపే పంపాలని తెలిపింది. జపాన్‌ సైతం ఇదే తరహా హెచ్చరిక సందేశాలను తమ ప్రజలకు పంపించింది. మరోవైపు ఉ.కొరియా ప్రయోగాన్ని అమెరికా ఖండించింది. బాలిస్టిక్‌ క్షిపణి సాంకేతికతను వినియోగించకుండా నిషేధం ఉన్నప్పటికీ కిమ్‌ ఇలాంటి ప్రయోగాలు చేపడుతుండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని