హిట్‌ నుంచి సూపర్‌హిట్‌కు..

పొరుగు దేశం నేపాల్‌తో స్నేహ బంధాన్ని మరింత దృఢపర్చుకోవాలనుకుంటున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్యనున్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు పురాతనమైనవే కాకుండా బలమైనవనీ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Published : 02 Jun 2023 03:55 IST

నేపాల్‌తో మైత్రీ బంధంపై ప్రధాని మోదీ వ్యాఖ్య
ఆ దేశ ప్రధాని ప్రచండతో దిల్లీలో భేటీ
విద్యుత్‌, రవాణా తదితర రంగాల్లో ఏడు ఒప్పందాలు

దిల్లీ: పొరుగు దేశం నేపాల్‌తో స్నేహ బంధాన్ని మరింత దృఢపర్చుకోవాలనుకుంటున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్యనున్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు పురాతనమైనవే కాకుండా బలమైనవనీ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వీటిని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు రెండు దేశాలూ కృషి చేస్తాయని ప్రకటించారు. ఈ స్నేహ స్ఫూర్తితోనే సరిహద్దు సమస్యను, ఇతర అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ)తో మోదీ గురువారం దిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా... రవాణా, పెట్రోలియం పైపులైన్‌ విస్తరణ, సమీకృత చెక్‌పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్‌ తదితర రంగాల్లో ఏడు ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. భారత్‌లోని రూపయిడిహా, నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌లో సమీకృత చెక్‌పోస్టులను లాంఛనంగా ప్రారంభించారు. రూపయిడిహా ఉత్తరప్రదేశ్‌లోని తొలి డ్రైపోర్టు కాబోతోంది. దీని ద్వారా... భారత్‌లోని జలమార్గాలను కూడా వాణిజ్య నిమిత్తం వాడుకోవటానికి నేపాల్‌కు వీలవుతుంది. బిహార్‌లోని బథ్‌నాహా నుంచి నేపాల్‌ కస్టమ్‌ యార్డ్‌ వరకు ఓ సరకు రవాణా రైలుకు ఇరువురు ప్రధానులు ఇక్కడి నుంచే పచ్చజెండా ఊపారు. వీటితోపాటు 10 ఏళ్ల కాలానికి రెండు దేశాల మధ్య ఇంధన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం... రాబోయే 10 ఏళ్లలో నేపాల్‌ నుంచి భారత్‌ 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. అంతేగాకుండా...40 మెగావాట్ల నేపాల్‌ జలవిద్యుత్‌ను భారత్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ఉద్దేశించిన ఒప్పందానికీ ఆమోదం లభించింది. ప్రాంతీయ సహకారంలో ఇదో కీలకమైన ముందడుగు కానుంది.


రామాయణ సర్క్యూట్‌ వేగవంతం

ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు మీడియాతో మాట్లాడారు. ‘‘తొమ్మిదేళ్ల కిందట ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే నేపాల్‌ పర్యటనకు వెళ్లా. ఇరు దేశాల బంధం ‘హిట్‌’ అవటానికి పలు ఒప్పందాలు చేసుకున్నాం. వాటిని సమర్థంగా అమలు చేశాం. ఇప్పుడు మళ్లీ ఆ బంధాన్ని మునుముందు సూపర్‌హిట్‌ చేసేందుకు ఇవాళ అనేక నిర్ణయాలు తీసుకున్నాం.సరిహద్దులనే అడ్డంకుల్లేని బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. రామాయణ సర్క్యూట్‌ ప్రాజెక్టులాంటి వాటిని వేగవంతం చేయాలని నిర్ణయించాం’’ అని మోదీ వెల్లడించారు.


మోదీ గ్రేట్‌ : ప్రచండ

ప్రచండ ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘తొమ్మిదేళ్ల కిందట ఇచ్చిన హామీలను నెరవేర్చటానికి, పనులను వేగంగా పూర్తి చేయటానికి మోదీ చూపించిన చొరవ అపూర్వం. పొరుగుకు ప్రాధాన్యం అనే ఆయన విదేశాంగ విధానం భేష్‌. ఈ తొమ్మిదేళ్లలో మోదీ సారథ్యంలో భారత్‌ అనూహ్య అభివృద్ధి సాధించటం సంతోషంగా ఉంది’’ అని ప్రశంసించారు. ‘‘సరిహద్దు వివాదం గురించి కూడా మోదీతో చర్చించా. దౌత్య యంత్రాంగం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని మోదీని కోరా’’ అని ప్రచండ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంపై రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని