ప్రతిదాడిగా కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం

మాస్కోపై డ్రోన్‌ దాడులు జరిగిన మర్నాడే రష్యా తీవ్రంగా స్పందించి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది.

Published : 02 Jun 2023 04:51 IST

చిన్నారి సహా ముగ్గురి మృతి

కీవ్‌: మాస్కోపై డ్రోన్‌ దాడులు జరిగిన మర్నాడే రష్యా తీవ్రంగా స్పందించి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 10 మంది తీవ్రంగా గాయపడ్డారని కీవ్‌ నగర అధికారులు తెలిపారు. గత నెలలో జరిగిన మొత్తం దాడులను పరిశీలిస్తే.. కీవ్‌లో ఈ స్థాయిలో ప్రాణనష్టం నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల కారణంగా.. గురువారం (జూన్‌ 1) జరగాల్సి ఉన్న అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని నిలిపివేస్తున్నామని నగర మేయర్‌ ప్రకటించారు. బుధవారం ఉక్రెయిన్‌ జరిపిన షెల్లింగ్‌ కారణంగా లుహాన్స్‌క్‌ ప్రాంతంలో ఓ కోళ్లఫారం వద్ద అయిదుగురు చనిపోగా.. 19 మంది గాయపడినట్లు రష్యా తెలిపింది. ఇటు రష్యా డ్రోన్లను, మిసైళ్లను ఉక్రెయిన్‌ క్షిపణి విధ్వంసక వ్యవస్థ సమర్థంగా అడ్డుకొంటున్నప్పటికీ వాటి శకలాలు ఇళ్ల మీద పడి అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు.. దేశ సరిహద్దుల్లో తాము 10 స్వల్పశ్రేణి ఇస్కాండర్‌ బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డగించి నేల కూల్చేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది.

అమెరికా సాయంపై రష్యా మండిపాటు

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన్‌ డాలర్ల సాయం ఖరారు కాగా, ఈ ప్యాకేజీపై రష్యా మండిపడింది. తమను వ్యూహాత్మకంగా ఓడించాలనే లక్ష్యంతో అమెరికా ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేసి.. అనవసరమైన పనులను అమెరికా ప్రోత్సహిస్తోందని అమెరికాలోని రష్యా రాయబారి ఆంటోనీ ఆంటనోవ్‌ వ్యాఖ్యానించారు.

పుతిన్‌ ప్రత్యర్థి నావెల్నీపై విచారణ 6న

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాజకీయ ప్రత్యర్థి అయిన అలెక్సీ నావెల్నీని ఓ కేసులో విచారించేందుకు మాస్కో సిటీ కోర్టు కొత్త తేదీని వెల్లడించింది. బుధవారం అతడిని విచారించాల్సి ఉండగా ఆ ప్రక్రియను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే శిక్ష అనుభవిస్తూ జైలులో ఉన్న నావెల్నీ.. తాజా కేసుతో దశాబ్దాల తరబడి జైలులోనే మగ్గే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని