ఉగ్రవాదంతో అంతర్జాతీయ భద్రతకు ముప్పు

అంతర్జాతీయ భద్రత, శాంతికి ఉగ్రవాదం నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు.

Published : 02 Jun 2023 04:51 IST

దానిపై అన్ని దేశాలు ఉక్కుపాదం మోపాలి
బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్‌ పిలుపు

కేప్‌టౌన్‌: అంతర్జాతీయ భద్రత, శాంతికి ఉగ్రవాదం నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. దానిపై అన్ని దేశాలూ ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు నిధుల సరఫరా ద్వారా ఉగ్రవాదం వ్యాప్తికి దోహదం చేస్తున్నాయంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సును ఉద్దేశించి జైశంకర్‌ గురువారం ప్రసంగించారు. కీలక సమకాలీన అంశాలపై బ్రిక్స్‌ దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఈ సంస్కరణల విషయంలో బ్రిక్స్‌ సభ్యదేశాలు చిత్తశుద్ధి ప్రదర్శించాలని సూచించారు.

లవ్రోవ్‌తో భేటీ

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో జైశంకర్‌ కేప్‌టౌన్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలు సహా బ్రిక్స్‌, జీ-20, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సంబంధిత వ్యవహారాలపై చర్చలు జరిపారు. గత నెల రోజుల్లో వీరిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి. మరోవైపు- భావసారూప్య దేశాలకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా బ్రిక్స్‌ను విస్తరించేందుకు తాము సుముఖంగా ఉన్నామని చైనా తెలిపింది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), అర్జెంటీనా, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ సహా పలు దేశాలు బ్రిక్స్‌లో చేరికకు గతంలో ఆసక్తి వెలిబుచ్చిన సంగతి గమనార్హం. భారత్‌తో పాటు బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ప్రస్తుతం బ్రిక్స్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు