సంక్షిప్త వార్తలు(5)

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు శుక్రవారం ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ముందస్తు బెయిలు గడువును ఈ నెల 13 వరకు పొడిగించింది.

Updated : 03 Jun 2023 05:34 IST

ఇమ్రాన్‌ ముందస్తు బెయిలు పొడిగింపు

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు శుక్రవారం ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ముందస్తు బెయిలు గడువును ఈ నెల 13 వరకు పొడిగించింది. లాహోర్‌లో సైనిక కమాండర్‌ నివాసంపై దాడి సహా మూడు కేసుల్లో ఈ ఉపశమనం లభించింది. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌(పీటీఐ) కార్యకర్త హత్య కేసులో కూడా లాహోర్‌ హైకోర్టు ఇమ్రాన్‌ బెయిలును ఈ నెల ఆరో తేదీ వరకు పొడిగించింది.

* జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్‌ఏబీ) ఛైర్మన్‌ తన ప్రతిష్ఠకు భంగంకలించారని పేర్కొంటూ ఆయనపై 1500 కోట్ల పాకిస్థానీ రూపాయల పరువు నష్టం దావా వేసేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ సిద్ధమయ్యారు. గత నెల జరిగిన అరెస్టు వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగిందని పేర్కొంటూ లీగల్‌ నోటీసు పంపించినట్లు తెలిపారు.


ఇమ్రాన్‌ ప్రకటనలను ప్రసారం చేయవద్దు

మీడియా సంస్థలకు పాక్‌ ప్రభుత్వ ఆదేశాలు

లాహోర్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాలు, ప్రకటనలు, ట్వీట్లు, చిత్రాలను ప్రచురించడం, ప్రసారం చేయడం వంటివి చేయవద్దని తమ దేశంలోని మీడియా సంస్థలకు పాకిస్థాన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం నుంచే దీనిని అమలుచేయాలని మీడియా సంస్థలకు ఆదేశాలు వెళ్లాయని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.


ఆహారంలో ఫ్లేవనాల్‌ను మర్చిపోతే.. మరుపే!

దిల్లీ: కొన్నిరకాల పండ్లు, కూరగాయల్లో ఉండే ఫ్లేవనాల్స్‌ అనే పోషక పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల.. వయసు మీదపడే క్రమంలో వచ్చే జ్ఞాపకశక్తి క్షీణత ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, బ్రిగ్‌హామ్‌ అండ్‌ వుమెన్స్‌ హాస్పటల్‌ శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు. వయసు మీదపడే కొద్దీ మెదడు సక్రమంగా పనిచేయడానికి నిర్దిష్ట పోషకాలు అవసరమన్న సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న 3,500 మంది వృద్ధులపై పరిశోధన ద్వారా దీన్ని ధ్రువీకరించారు. వీరు ఎంత పరిమాణంలో ఫ్లేవనాల్‌ తీసుకుంటున్నారన్నది పరిశీలించారు. అలాగే వార్ధక్యం వల్ల వారిలో జ్ఞాపకశక్తి క్షీణత ఎంత ఉందన్నది నిర్దిష్ట పరీక్షల్లో స్కోరు ద్వారా తేల్చారు. వీరికి ఫ్లేవనాల్‌ సప్లిమెంట్‌ పిల్‌ను మూడేళ్లు పాటు ఇచ్చి చూశారు. తొలుత ఈ పదార్థాల కొరత ఎదుర్కొన్నవారికి మాత్రల వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు గుర్తించారు.


చిరుతిళ్లతో గాఢనిద్రకు చేటు

దిల్లీ: పోషక విలువలు లేని చిరుతిళ్లు (జంక్‌ ఫుడ్‌) తీసుకుంటే గాఢనిద్రపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్వీడన్‌లోని ఉప్సల విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు. మానవుడి నిద్రలో అయిదు దశలుంటాయి. వాటిలో మూడవది గాఢ నిద్ర. అది జ్ఞాపకాలు, కండరాల పెరుగుదల, రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తుంది. చిరుతిళ్లు తీసుకున్న తరవాత గాఢనిద్ర దెబ్బతింటుంది. రోజూ ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయే 15మంది ఆరోగ్యవంతులపై స్వీడన్‌లో పరిశోధనలు జరిగాయి. వారందరి శరీర బరువు సాధారణంగానే ఉంది. వారికి వారంరోజుల పాటు మార్చిమార్చి సమతుల ఆహారం, చిరుతిళ్లు ఇచ్చి చూశారు. చిరుతిళ్లలో చక్కెర, కొవ్వు, రసాయనాలతో ప్రాసెస్‌ చేసిన ఆహారం ఎక్కువగా ఉంది. నిష్ఫల ఆహారం తీసుకున్నప్పుడు వారి గాఢనిద్రలో మంద్ర తరంగ కార్యకలాపాలు తగ్గిపోయాయి. మరునాడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఇదే ప్రభావం కొనసాగింది.


భూతాపంతో సముద్రపు చేపల వలస

దిల్లీ: భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం సముద్ర జీవులపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకులు వెల్లడించారు. భూతాపంతో సముద్ర జలాలూ వేడెక్కుతున్నాయని, దీని వల్ల మత్స్య జాతులు చల్లని ప్రదేశాలైన ఉత్తర, దక్షిణ ధ్రువాల వైపునకు, సముద్రంలోని మరింత లోతైన ప్రదేశాలకు తరలిపోతున్నాయని బ్రిటన్‌కు చెందిన గ్లాస్గో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. పరిసర జలాల ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు వచ్చినా సముద్రంలోని మత్స్య జాతుల జీవ క్రియలతో పాటు వాటి ఎదుగుదల, సంతానోత్పత్తిపైనా ప్రతికూల ప్రభావంపడుతోందని తెలిపారు. భూతాపం జంతువులపై కన్నా చేపలపై ఏడింతల వేగంతో ప్రభావం చూపుతుందని నిర్ధరించారు. వీరు పరిశోధనలో భాగంగా 115 రకాల సముద్ర జీవులను, 595 రకాల చేపలను పరిశీలించి అధ్యయన నివేదికను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని