తనను భారత్‌కు అప్పగించడంపై అమెరికా కోర్టులో రాణా పిటిషన్‌

ముంబయి ఉగ్రదాడుల (2008) కేసులో నిందితుడిగా ఉన్న పాకిస్థాన్‌ సంతతి కెనడా జాతీయుడు తహవుర్‌ రాణా(62)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌ కోర్టు మేలో అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

Published : 03 Jun 2023 05:26 IST

వాషింగ్టన్‌: ముంబయి ఉగ్రదాడుల (2008) కేసులో నిందితుడిగా ఉన్న పాకిస్థాన్‌ సంతతి కెనడా జాతీయుడు తహవుర్‌ రాణా(62)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌ కోర్టు మేలో అనుమతిచ్చిన విషయం తెలిసిందే. లాస్‌ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటిన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఖైదీగా ఉన్న రాణా ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశాడు. ఈ అప్పగింత అమెరికా-భారత్‌ల మధ్య ఉన్న ఒప్పందాన్ని రెండు విధాలుగా ఉల్లంఘిస్తుందని అతని తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందులో మొదటిది... ఒప్పందంలోని 6(1) నిబంధన ప్రకారం భారత్‌ ఎలాంటి అభియోగాలపై విచారణ చేయాలని కోరుతోందో... అలాంటి వాటిపైనే ఎవరైనా వ్యక్తిని అమెరికాలోని ఏదైనా కోర్టు విచారణ చేసి, నిర్దోషిగా ప్రకటిస్తే అతణ్ని అప్పగించకూడదు. రాణాను ఇప్పటికే నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ కోర్టు విచారించి, నిర్దోషిగా ప్రకటించింది. రెండోది... ఒప్పందంలోని 9.3 నిబంధన ప్రకారం భారత్‌ పంపిన ఆధారాలు, సాక్ష్యాలు నిందితుడిని దోషిగా నిర్ధారించలేకపోతే అతణ్ని అప్పగించకూడదు. రాణా విషయంలో ఇప్పటికే అది జరిగింది. అందుకే అతణ్ని భారత్‌కు అప్పగించడాన్ని నిలువరించాలని న్యాయవాది కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని