ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే సహించం: బ్రిక్స్‌

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడుతామని శుక్రవారం బ్రిక్స్‌ దేశాలు ప్రకటించాయి.

Published : 03 Jun 2023 06:01 IST

కేప్‌టౌన్‌: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడుతామని శుక్రవారం బ్రిక్స్‌ దేశాలు ప్రకటించాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్నీ అడ్డుకుంటామనీ, వారికి ఆశ్రయం కల్పించే దేశాలనూ ఎదుర్కొంటామని పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ ఆశ్రయమిస్తోందని భారత్‌ మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పాక్‌ పేరెత్తకుండా ఉగ్రవాదుల ఆశ్రయ స్థలాలపై పోరాడతామని బ్రిక్స్‌ విదేశాంగ మంత్రులు ఇక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొనడం కీలక పరిణామం. భారత్‌, బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఎవరు ఎక్కడ ఎప్పుడు పాల్పడినా ఖండిస్తామని బ్రిక్స్‌ సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధానికి ఐక్యరాజ్యసమితి ఛత్రంలో సమగ్ర ఒప్పందాన్ని త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చింది. జీవ, రసాయనాస్త్రాలతో ఉగ్రవాదానికి పాల్పడకుండా అంతర్జాతీయ ఒప్పందం కుదరాలనీ కోరింది. ఉగ్రవాదంపై పోరాటానికి బ్రిక్స్‌ ఏర్పాటుచేసిన కార్యబృందం పనితీరును ప్రశంసించింది. ఈ పోరులో మరింతగా సహకరించుకోవాలని పిలుపు ఇచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన దరిమిలా రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్యలు విధించిన ఆర్థిక ఆంక్షలను నేరుగా ప్రస్తావించకుండా ఇటువంటి ఏకపక్ష ఆర్థిక చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయని సంయుక్త ప్రకటన హెచ్చరించింది. పరస్పర ఆర్థిక సహకార వృద్ధికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న జీ 20 కృషి చేస్తుందని ఉద్ఘాటించింది. బ్రిక్స్‌ దేశాల మధ్య, వాటి వాణిజ్య భాగస్వాముల మధ్య స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారం జరగడం ముఖ్యమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి విభాగాలను సంస్కరించాలనీ, సమితిలో భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలకు మరింత ప్రముఖ పాత్ర లభించాలని పిలుపు ఇచ్చింది. పారిస్‌ వాతావరణ సభ తీర్మానాలను అమలు చేయడానికి బ్రిక్స్‌ కట్టుబడి ఉందని తెలిపింది.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు