సంక్షిప్త వార్తలు(4)

రోదసిలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విజయవంతంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు.

Updated : 05 Jun 2023 06:12 IST

క్షేమంగా భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు

బీజింగ్‌: రోదసిలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విజయవంతంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. షెంజౌ-15 వ్యోమనౌకలో వీరు ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌లో దిగారు. అనంతరం విమానంలో బీజింగ్‌ చేరుకున్నారు. ఈ వ్యోమగాములు కొంతకాలం పాటు మెడికల్‌ క్వారంటైన్‌లో ఉంటారు. ఆ సమయంలో వారిపై సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీరి స్థానంలో మరో ముగ్గురు వ్యోమగాములు మే 30న అంతరిక్ష కేంద్రానికి చేరిన సంగతి తెలిసిందే. వారు ఐదు నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తిస్తారు.


డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా చిన్నారుల కెరీర్‌ ప్రణాళిక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిద్ధం

వాషింగ్టన్‌: పిల్లల లాలాజలం నుంచి సేకరించిన జన్యువులను విశ్లేషించడం ద్వారా వారికి అనువైన కెరీర్‌ ప్రణాళికను సూచించే ఒక సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైంది. భారత అమెరికన్‌ వ్యాపారవేత్త మహ్మద్‌ ముస్తఫా దీన్ని రూపొందించారు. దేశంలో నైపుణ్యానికి సరైన మార్గనిర్దేశం చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. దీని ఆధారంగా సంబంధిత చిన్నారికి ప్రత్యేకమైన పాఠశాల విద్యను అందించొచ్చని పేర్కొన్నారు.

‘‘ప్రతి చిన్నారికీ ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. జన్యువులు ఆధారంగా దీన్ని అర్థంచేసుకోవచ్చు. తద్వారా పిల్లల భవితపై సరైన అవగాహన ఏర్పడుతుంది. దీని ప్రాతిపదికన 10-15 ఏళ్ల కెరీర్‌ వృద్ధి, నైపుణ్య ప్రణాళికను మేం అందించగలం’’ అని మహ్మద్‌ ముస్తఫా వివరించారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు.. ‘ప్రతి చిన్నారికి అన్నీ బోధించాలి’ అనే రీతిలో సాగుతున్నాయని తెలిపారు. ‘‘తర్వాతి దశలో కొన్ని దేశాలు మేధో పరీక్షలు నిర్వహించి, పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటి ఆధారంగా చిన్నారుల కెరీర్‌ను నిర్ణయిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. పిల్లల సామర్థ్యాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవడానికి పూర్తిస్థాయిలో జీన్‌ మ్యాపింగ్‌ చేస్తామని తెలిపారు.


చైనాలో విరిగిపడిన కొండ చరియలు
14 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో కొండ చరియలు విరిగిపడటంతో కనీసం 14 మంది మరణించారు. మరో అయిదుగురి జాడ తెలియడం లేదు. లేషన్‌ నగరంలో ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం 180 మంది సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని అధికారులు తెలిపారు.


సూయిజ్‌ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్‌

కైరో: ముడి చమురును సరఫరా చేస్తున్న ఓ ట్యాంకర్‌ ఆదివారం ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో మరమ్మతుకు గురై ఆగిపోయింది. దీంతో ఈ జలమార్గంలో రవాణాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు చమురును సరఫరా చేస్తున్న మాల్టా దేశ నౌకకు యాంత్రికపరమైన లోపం తలెత్తడంతో ఆగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ ట్యాంకర్‌ వెనక మరో ఎనిమిది నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు. మూడు పడవలు కొన్ని గంటలపాటు శ్రమించి ఆ ట్యాంకర్‌ను వేరే చోటుకు తరలించాయని, దీంతో అక్కడి ట్రాఫిక్‌ సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు