వాషింగ్టన్‌ గగనతలంలో విమానం కలకలం!

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ గగనతలంలో ఓ చిన్న విమానం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆ లోహవిహంగాన్ని ఎఫ్‌-16 యుద్ధ విమానం వెంబడించింది.

Published : 06 Jun 2023 04:07 IST

సూపర్‌సోనిక్‌ వేగంతో వెంబడించిన ఎఫ్‌-16  
భారీ ధ్వనితో హడలిన ప్రజలు

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ గగనతలంలో ఓ చిన్న విమానం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆ లోహవిహంగాన్ని ఎఫ్‌-16 యుద్ధ విమానం వెంబడించింది. ఈ క్రమంలో ఈ ఫైటర్‌ జెట్‌ అత్యంత వేగంగా జనావాసాలపై నుంచి ప్రయాణించడంతో భారీ స్థాయిలో శబ్దాలు వినిపించాయి. దీంతో వాషింగ్టన్‌ ప్రజలు హడలిపోయారు. చివరికి ఆ చిన్న విమానం వర్జీనియాలో కూలిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం టెన్నెసీ రాష్ట్రంలోని ఎలిజబెత్‌టన్‌ నుంచి ఓ బిజినెస్‌ జెట్‌ టేకాఫ్‌ అయ్యింది. లాంగ్‌ ఐలాండ్‌ (న్యూయార్క్‌)లోని మెక్‌ఆర్థర్‌ ఎయిర్‌పోర్టుకు అది వెళ్లాల్సింది. అయితే అనూహ్యంగా తన దిశను మార్చుకుంది. లాంగ్‌ ఐలాండ్‌పై కొంతసేపు చక్కర్లు కొట్టి, అకస్మాత్తుగా వాషింగ్టన్‌ గగనతలంలోకి ప్రవేశించింది. భద్రతాపరంగా అత్యంత సున్నితమైన ప్రదేశాలపై తిరగడంతో సైన్యం అప్రమత్తమైంది. ఆ బిజినెస్‌ జెట్‌ పైలట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించింది. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒక ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని పంపింది.

సోనిక్‌ శబ్దాలతో..

సాధారణంగా జనావాసాలకు ఎగువన యుద్ధ విమానాలు నిర్ణీత వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ధ్వనిని మించిన వేగం (సూపర్‌సోనిక్‌)తో దూసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. బిజినెస్‌ జెట్‌ను వెంబడించే క్రమంలో ఎఫ్‌-16 యుద్ధవిమానం సూపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణించాల్సి వచ్చింది. ఫలితంగా భారీ స్థాయిలో శబ్దాలు (సోనిక్‌ బూమ్‌) వినిపించాయి. వాషింగ్టన్‌తో పాటు, వర్జీనియా, మేరీల్యాండ్‌ వరకు ఈ శబ్దాలు రావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బిజినెస్‌ జెట్‌ పైలట్‌ దృష్టిని ఆకర్షించేందుకు ఎఫ్‌-16 యుద్ధవిమాన పైలట్‌.. ఆకాశంలో జ్వాలలను వెదజల్లారు. వాటివల్ల నేలమీద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు.

అమాంతంగా కుప్పకూలి..

కొంతసేపు వాషింగ్టన్‌పై ప్రయాణించిన ఆ బిజినెస్‌ విమానం వర్జీనియాలోని ఓ అటవీప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అత్యంత ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానం అమాంతం కూలినట్లు తెలుస్తోంది. నిమిషానికి 30వేల అడుగుల చొప్పున కిందకి జారిపోయింది. ఈ విమానం ఫ్లోరిడాలోని ఎన్‌కోర్‌ మోటార్స్‌ అనే కంపెనీ పేరిట రిజిస్టర్‌ అయింది. ఈ సంస్థ యజమాని జాన్‌ రంపెల్‌ స్పందిస్తూ.. ఆ విమానంలో తన కుమార్తె, 2 ఏళ్ల మనవరాలు, ఆయా, పైలట్‌ ఉన్నట్లు తెలిపారు. తనను చూడడానికి వచ్చి ఆ తర్వాత వారంతా ఆ విమానంలో ఇంటికి తిరుగుపయనమైనట్లు చెప్పారు. ఘటనాస్థలంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో కనిపించలేదని వర్జీనియా పోలీసులు వెల్లడించారు. విమానంలో పీడనం పడిపోయి ఉంటుందని, అందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.


ఆ సమయంలో బైడెన్‌ గోల్ఫ్‌ ఆడుతూ..

యుద్ధ విమానం బిజినెస్‌ జెట్‌ను వెంబడించిన సమయంలో అధ్యక్షుడు బైడెన్‌.. ఆండ్రూస్‌ సైనిక స్థావరం వద్ద గోల్ఫ్‌ ఆడుతున్నట్లు అధికారులు తెలిపారు. విమాన ఘటన కారణంగా ఆయన షెడ్యూల్‌ ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని