సంక్షిప్త వార్తలు(3)

హానికర రేడియోధార్మికత నుంచి భూమిపై జీవులను రక్షించే ఓజోన్‌ పొర ఆశించిన స్థాయిలో కోలుకోవడంలేదని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 07 Jun 2023 05:37 IST

ఓజోన్‌ పొర ఆశించినంత కోలుకోవడం లేదు

యూవీ రేడియోధార్మికత పెరుగుతోంది: శాస్త్రవేత్తలు

దిల్లీ: హానికర రేడియోధార్మికత నుంచి భూమిపై జీవులను రక్షించే ఓజోన్‌ పొర ఆశించిన స్థాయిలో కోలుకోవడంలేదని తాజా అధ్యయనం పేర్కొంది. ఫలితంగా గత కొన్నేళ్లలో భూ ఉపరితలంపై అతినీలలోహిత (యూవీ) రేడియోధార్మికత పెరుగుతోందని వివరించింది. భూ వాతావరణంలో ఎగువన ఉండే ఓజోన్‌ పొర చాలాచోట్ల బలహీనపడింది. ఇందుకు కారణం మానవ చర్యలే. ఓజోన్‌ పొరకు హానికలిగించే రసాయనాల కట్టడి వంటి చర్యలతో ప్రపంచ దేశాలు దిద్దుబాటుకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. వీటివల్ల పరిస్థితి క్రమంగా మారుతోంది. ఈ శతాబ్దం మధ్య నాటికి ఓజోన్‌ పొర పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే 2010 తర్వాత ఉష్ణమండల ప్రాంతాలు, ఉత్తర మధ్య అక్షాంశాల్లోని ప్రాంతాల్లో యూవీ రేడియోధార్మికత పెరుగుతోందని వెల్లడైంది. దీనివల్ల మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని చైనాలోని బీజింగ్‌ నార్మల్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఓజోన్‌ కోలుకునే ప్రక్రియ ఇంత మందగమనంలో సాగుతుందని తాము ఊహించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహ డేటా, మోడల్‌ సిమ్యులేషన్ల ఆధారంగా వీరు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో యూవీ రేడియోధార్మికత పెరగడం వల్ల వ్యవసాయం, ప్రజారోగ్యంపై పడే ప్రభావాన్ని ఎదుర్కోవడానికి విధాన నిర్ణేతలు సిద్ధం కావాలని పరిశోధకులు సూచించారు. ఓజోన్‌ పొర పునరుద్ధరణ అనేది సంక్లిష్ట ప్రక్రియ అని, భూతాపం వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని స్పష్టమవుతోందన్నారు. అది పూర్తిస్థాయిలో ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందన్నదానిపై అనిశ్చితి ఉందని పేర్కొన్నారు.


టీకా పొందని కొవిడ్‌ బాధితులకు రెండేళ్ల వరకూ ప్రభావాలు!

దిల్లీ: కొవిడ్‌-19 టీకా పొందని కరోనా బాధితుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన రెండేళ్ల వరకూ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని స్విట్జర్లాండ్‌లోని జూరిక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. 1,106 మందిపై అధ్యయనం జరిపి ఈ మేరకు తేల్చారు. వీరంతా టీకాలు పొందలేదు. వీరి సరాసరి వయసు 50 ఏళ్లు. 2020 ఆగస్టు 6 నుంచి 2021 జనవరి 19 మధ్య వీరు కొవిడ్‌ బారినపడ్డారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన 24 నెలల తర్వాత కూడా 17 శాతం మందిలో కొవిడ్‌ సంబంధ లక్షణాలు కనిపించాయి. 55 శాతం మంది.. నెలలోపే పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. మరో 18 శాతం మంది 1-3 నెలల్లోపు కోలుకున్నారు. ఆరు నెలలు గడిచాక 23 శాతం మంది ఇంకా అనారోగ్యంగానే ఉన్నారు. వీరికి రుచి, వాసన సామర్థ్యంలో మార్పులు, శారీరక శ్రమ తర్వాత అనారోగ్యం, శ్వాసలో ఇబ్బంది, మానసిక ఆరోగ్య సమస్యలు వంటివి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


లాహోర్‌ హైకోర్టులో బుష్రా బీబీ పిటిషన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ భార్య బుష్రా బీబీ మంగళవారం లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా తనపై నమోదై ఉన్న కేసులన్నింటి వివరాలను ఆమె కోరారు. భర్త ఇమ్రాన్‌పై ప్రభుత్వం ఆంక్షలతో ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో.. ఏదో ఒక కేసు సాకుతో తనను కూడా అరెస్టు చేసే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నట్లు బుష్రా తన పిటిషనులో పేర్కొన్నారు. బహిర్గతం కాని కేసుల పేరుతో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్న అల్‌ ఖదర్‌ యూనివర్సిటీ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్న బుష్రా బీబీ వాంగ్మూలాన్ని బుధవారం నమోదు చేసేలా నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) ఆమెకు ఇప్పటికే సమన్లు జారీ చేసి ఉండటం గమనార్హం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని