ఉక్రెయిన్‌లో డ్యాం పేల్చివేత
ఉక్రెయిన్ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున భీకర పోరు జరుగుతున్న దక్షిణ ఉక్రెయిన్‌లోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో అత్యవసర పరిస్థితి తలెత్తింది.
సమీప ప్రాంతాల్లోకి వెల్లువెత్తిన వరద
ఖాళీ చేస్తున్న జనం
అణు విద్యుత్తు కేంద్రానికి ముప్పు!
కీవ్: ఉక్రెయిన్ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున భీకర పోరు జరుగుతున్న దక్షిణ ఉక్రెయిన్‌లోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో సమీప ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. మరోవైపు ఐరోపాలోని అతి పెద్ద అణు విద్యుత్తు కేంద్రం జపోరిజియాకు ముప్పు ఏర్పడింది. తాగునీటి సరఫరాకూ ఆటంకం కలగనుంది. ఈ పేల్చివేతకు రష్యా కారణమని ఉక్రెయిన్ అంటుండగా.. ఉక్రెయినే పేల్చి వేసిందని రష్యా అంటోంది. డ్యాంకు సమీపంలోని రెండు దేశాలకు చెందిన వారిని ఖాళీ చేయించే పనిలో ఉక్రెయిన్, రష్యా నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం నీపర్ నదీ ప్రాంతం, దానిపై ఉన్న జల విద్యుత్తు కేంద్రం రష్యా అధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌కు 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ డ్యాం వ్యూహాత్మకంగా చాలా కీలకం. గత కొన్ని నెలలుగా దీని సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ మిలిటరీ కమాండ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రష్యా దళాలే పేల్చివేశాయని ఆరోపించింది. మరోవైపు ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు ఇది ఉగ్రదాడని చెబుతున్నట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా స్థానిక మేయర్ వ్లాదిమిర్ లియోనేటివ్ మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి రెండు గంటల నుంచి కఖోవ్కా డ్యాంపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు గేటు వాల్వులు దెబ్బతిన్నాయి. ఫలితంగా నీటి లీకులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే నియత్రించలేని విధంగా నీరు కిందకు ప్రవహించడం మొదలైంది’ అని వెల్లడించారు. డ్యాం పేల్చివేతతో వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని రష్యా అధికారిక మీడియా పేర్కొంది. మరోవైపు నీపర్ నదికి తూర్పు తీరాన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
డ్యాం ఎందుకంత కీలకం?
ఉక్రెయిన్‌లో అతి పెద్ద డ్యాంలలో ఒకటైన కఖోవ్కా ఎత్తు 30 మీటర్లు. 1956లో జల విద్యుత్తు కేంద్రంలో భాగంగా ఖేర్సన్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మించారు. రష్యా అధీనంలోని ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్లో నిల్వ ఉండే నీరు అమెరికాలోని గ్రేట్ సాల్ట్ లేక్‌లోని నీటికి సమానం. మొత్తం 18 మిలియన్ల క్యూబిక్ మీటర్ల (4.8 బిలియన్ల గాలన్లు) నీరు ఉంటుంది. దక్షిణ ఉక్రెయిన్‌లో విద్యుత్తు, సాగునీటి, తాగునీటి అవసరాలకు ఇదే పెద్ద ఆధారం. జపోరిజియా అణు విద్యుత్తు కేంద్ర కూలింగ్ అవసరాలనూ తీరుస్తుంది.
* యుద్ధం ప్రారంభమైన మొదట్లోనే రష్యా ఈ డ్యాంను అధీనంలోకి తీసుకుంది. అప్పట్లోనే డిటోనేటర్లను వాడటంతో మూడు స్లూయిజ్ గేట్లు ధ్వంసమయ్యాయి. అయినా రష్యా వాటికి మరమ్మతులు చేయించలేదు. మంగళవారం డ్యాం పేల్చివేతతో తీవ్ర ఆందోళన నెలకొంది.
* మంగళవారం తెల్లవారుజామున 2.50 గంటలకు రష్యా దళాలు డ్యాంను పేల్చివేశాయని, 80 గ్రామాలకు వరద ముప్పు తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. జపోరిజియా కూలింగ్ వ్యవస్థను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
* ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మక్ వరదలకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. 45వేల మంది నివశించే కఖోవ్కా పట్టణంలోని పరిపాలనా కార్యాలయం ఉన్న వీధుల్లో వరద పారుతోంది.
* డ్యాం కూల్చివేతపై రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఎవరు చేశారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇరు దేశాలకూ ఈ డ్యాంతో ప్రయోజనాలున్నాయి. దక్షిణ భాగంలో రష్యాపై ఎదురు దాడులకు దిగుతున్న ఉక్రెయిన్‌కు డ్యాం కూలడం పెద్ద దెబ్బ. డ్యాంను కవచంగా వాడుకునే ఉక్రెయిన్ దాడులకు వ్యూహం పన్నింది.
* ఈ రిజర్వాయరు నుంచే 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాకు నీటి సరఫరా జరుగుతుంటుంది.
రష్యా ఉగ్ర దేశం: ఉక్రెయిన్
ద హేగ్: రష్యాను ఉగ్ర దేశంగా ఉక్రెయిన్ అభివర్ణించింది. నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానంలో ఆ దేశానికి వ్యతిరేకంగా మంగళవారం ఉక్రెయిన్ దౌత్యవేత్త వాదనలను వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా