హైపర్‌సోనిక్ క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్
ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌సోనిక్ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్ ప్రకటించింది.
దుబాయ్: ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లే హైపర్‌సోనిక్ క్షిపణిని రూపొందించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ అస్త్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అణు కార్యక్రమంపై అమెరికాతో ఉద్రిక్తతలు ఏర్పడ్డ తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ చర్య ద్వారా పశ్చిమాసియాలో తన శత్రువులను లక్ష్యంగా చేసుకోని ఆయుధాలను మోహరించగలనన్న సంకేతాన్ని ఇరాన్ ఇచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్షిపణికి ‘ఫత్తా’ అని పేరు పెట్టారు. తాజాగా దీని నమూనాను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లోని ఏరోస్పేస్ విభాగం అధిపతి జనరల్ అమిర్ అలీ హాజీజాదే ఆవిష్కరించారు. ఈ క్షిపణి 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని వివరించారు. దీన్ని నేలకూల్చగల అస్త్రమేదీ లేదన్నారు. దీనిద్వారా శత్రువుల దూకుడుకు కళ్లెం వేసే శక్తిని సాధించామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫత్తాలో కదిలే నాజిల్ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల అది మార్గమధ్యంలో తన గమనాన్ని మార్చుకోగలదని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.