‘మిర్రర్‌’ ఫోన్‌ హ్యాకింగ్‌ కేసు విచారణ.. తొలిసారి కోర్టుకు హాజరైన ప్రిన్స్‌ హ్యారీ

బ్రిటన్‌ రాజకుటుంబ చరిత్రలో మరో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. గత 130 ఏళ్లలో తొలిసారిగా ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

Published : 07 Jun 2023 04:38 IST

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబ చరిత్రలో మరో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. గత 130 ఏళ్లలో తొలిసారిగా ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఫోన్‌ హ్యాకింగుకు సంబంధించిన కేసులో ‘మిర్రర్‌’ వార్తాసంస్థకు వ్యతిరేకంగా కింగ్‌ ఛార్లెస్‌-3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ (38) కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు. బ్రిటన్‌కు చెందిన ‘మిర్రర్‌’ గ్రూప్‌ న్యూస్‌పేపర్స్‌ (ఎంజీఎన్‌) అనేకమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగాను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతోపాటు వంద మందికి పైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై లండన్‌ హైకోర్టు విచారణ చేపట్టగా.. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. భార్య మేఘన్‌ మర్కెల్‌, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆయన సోమవారం లండన్‌కు చేరుకొని, మరుసటిరోజు హైకోర్టుకు వచ్చారు. బైబిల్‌పై ప్రమాణం చేశాక తన వాదన వినిపించారు. హ్యారీని గంటల తరబడి ప్రశ్నించిన మిర్రర్‌ గ్రూపు న్యాయవాదులు ఇదే వారంలో ఆయనను మరోమారు ప్రశ్నించనున్నట్లు సమాచారం. 1891లో బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ఎడ్వర్డ్‌-7 ఓ జూదం కేసులో ఇంగ్లిష్‌ హైకోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఇది ఆయన రాజు కాకముందు జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ కుటుంబ వారసుడు కోర్టు మెట్లు ఎక్కాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని