సంక్షిప్త వార్తలు (4)

రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని సాధారణ ప్రయోగశాల విధానాల కన్నా కృత్రిమ మేధ (ఏఐ) అల్గోరిథమ్స్‌ మరింత కచ్చితంగా అంచనా వేయగలిగాయని అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్త విఘ్నేష్‌ అరసు నాయకత్వంలోని పరిశోధక బృందం తెలిపింది.

Updated : 08 Jun 2023 06:13 IST

రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపులో ఏఐ ముందంజ

దిల్లీ: రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని సాధారణ ప్రయోగశాల విధానాల కన్నా కృత్రిమ మేధ (ఏఐ) అల్గోరిథమ్స్‌ మరింత కచ్చితంగా అంచనా వేయగలిగాయని అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్త విఘ్నేష్‌ అరసు నాయకత్వంలోని పరిశోధక బృందం తెలిపింది. ఆ బృందం వేలాది మామోగ్రామ్‌లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు బి.సి.ఎస్‌.సి వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా మహిళ ఇచ్చే సమాచారం, ఆమె వయసు, కుటుంబంలో ఈ వ్యాధి ఎవరికైనా వచ్చిందా, ఆమెకు ప్రసవం అయిందా అనే అంశాలను బట్టి వ్యాధి వచ్చే ప్రమాదాన్ని అంచనా వేస్తున్నారు. తాజా పరిశోధనలో 2016నాటి మామోగ్రామ్‌లను పరిశీలించి క్యాన్సర్‌ ప్రమాదాన్ని పసిగట్టడంలో సంప్రదాయ విధానాల కన్నా ఏఐ అల్గొరిథమ్‌లే ఆధిక్యం కనబరిచాయి.


మగ శిశు జననాల్ని దెబ్బతీసిన ‘భోపాల్‌ గ్యాస్‌’

దిల్లీ: భోపాల్‌లో 1984లో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం సంభవించిన సమయంలోనూ, ఆ తరవాత పుట్టిన పురుషులకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువైందనీ, వారికి శారీరకంగానే కాక మానసికంగా కూడా వైకల్యం సంభవించి చదువు, ఉద్యోగాలలో రాణించలేకపోతున్నారని తాజా అధ్యయనం నిర్ధారించింది. కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన గోర్డన్‌ మెకార్డ్‌, అనితా రాజ్‌, ప్రశాంత్‌ భరద్వాజ్‌లు నిర్వహించిన పరిశోధన పత్రం బీఎంజె ఓపెన్‌ పత్రికలో ప్రచురితమైంది. వాయువు లీకైన సమయంలో తల్లి గర్భంలో ఉన్నవారు కాలక్రమంలో క్యాన్సర్‌, మానసిక, శారీరక వైకల్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువయ్యాయని పరిశోధకులు కనుగొన్నారు. ఆ దుర్ఘటన స్త్రీల పునరుత్పత్తిని దెబ్బతీసింది. గర్భస్రావాలు నాలుగింతలు పెరిగిపోయాయి. మృత శిశు జననాలు, నవజాత శిశు మరణాలు ఎక్కువైపోయాయి. భోపాల్‌ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో నివసించిన స్త్రీలకు మగశిశు జననాలు 4శాతం తగ్గాయి.


150 కోట్ల ఏళ్లనాటి అణువుల గుర్తింపు

దిల్లీ: భూమికి 1200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో కర్బన పునాది గల సంక్లిష్ట సేంద్రియ అణువులను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అమెరికా జాతీయ వైమానిక, అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కనిపెట్టిన ఈ సేంద్రియ అణువులు భూమిపై పొగ, మసి, కాలుష్యజనిత పొగ మంచులలో కనిపిస్తాయి. క్యాన్సర్‌ కారక హైడ్రో కార్బన్‌ ఉద్గారాలలోనూ కనిపిస్తాయి. అయితే ఈ కర్బన సేంద్రియ అణువుల వల్ల విశ్వానికి ఎలాంటి ప్రమాదమూ లేదని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం విశ్వవిద్యాలయానికి చెందిన జస్టిన్‌ స్పిల్కర్‌ చెప్పారు. విశ్వం ఆవిర్భవించి 1,300 కోట్ల సంవత్సరాలైందని శాస్త్రజ్ఞుల అంచనా. విశ్వం పుట్టిన 150 కోట్ల ఏళ్లకు ఏర్పడిన కర్బన సేంద్రియ అణువుల నుంచి వెలువడిన కాంతిని ఇప్పుడు పసిగట్టడం విశేషం. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ యువ విశ్వానికి చెందిన సంక్లిష్ట అణువులను గుర్తించడం దాని సమర్థతకు నిదర్శనం.


ప్రార్థనా మందిరాల పవిత్రత దెబ్బతీసినా విద్వేష నేరమే 

మిషిగన్‌ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన  భారత సంతతి నేత

వాషింగ్టన్‌: ప్రార్థనా మందిరాల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను విద్వేష నేరాల కింద పరిగణించాలని కోరుతూ మిషిగన్‌ రాష్ట్ర ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు రంజీవ్‌ బిల్లు ప్రవేశ పెట్టారు. దీపావళి, వైశాఖి, ఈద్‌-ఉల్‌-ఫితర్‌, ఈద్‌-ఉల్‌-అదాలను సెలవులుగా ప్రకటించాలని మరో బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. ‘‘ఆలయం, మసీదు, గురుద్వారాల పవిత్రతకు భంగం కలిగించినా ఆ దోషులను శిక్షించడం ఇక ఈ బిల్లుతో సులభం అవుతుంది’’ అని పురి చెప్పారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు