కొత్త పార్లమెంటులో ‘అఖండ భారత్‌’ కళాత్మక చిత్రమే...రాజకీయ పటం కాదు...

భారత దేశ కొత్త పార్లమెంటు భవనంలోని ‘అఖండ భారత్‌’ కుడ్య చిత్రంపై నేపాల్‌ చట్టసభల సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పటంలో నేపాల్‌ పరిధిలోని ప్రాంతాలూ ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2023 05:12 IST

నరేంద్ర మోదీ ఇదే విషయం చెప్పారు..
నేపాల్‌ చట్టసభలో ఆ దేశ ప్రధాని ప్రచండ వెల్లడి

కాఠ్మాండూ: భారత దేశ కొత్త పార్లమెంటు భవనంలోని ‘అఖండ భారత్‌’ కుడ్య చిత్రంపై నేపాల్‌ చట్టసభల సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పటంలో నేపాల్‌ పరిధిలోని ప్రాంతాలూ ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల భారత్‌ పర్యటన సందర్భంగా ఆ పటం విషయమై ఎందుకు ప్రశ్నించలేదంటూ నేపాల్‌ ప్రధాని ప్రచండను అక్కడి విపక్ష సభ్యులు బుధవారం నిలదీశారు. దీనికి ఆయన సమాధానమిస్తూ...‘భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా అఖండ భారత్‌ పటం అంశాన్ని చర్చించాను. ఇది సాంస్కృతిక, కళాత్మక చిత్రమే... రాజకీయ పటం కాదని మోదీ చెప్పారు. అశోక చక్రవర్తి కాలంనాటి ప్రాచీన భారత్‌ను ప్రతిబింబించేలా కుడ్య చిత్రాన్ని కొత్త పార్లమెంటు భవనంలో అమర్చినట్లు ఆయన తెలిపార’ని నేపాల్‌ చట్టసభ సభ్యులకు వివరించారు. భారత్‌, నేపాల్‌ మధ్య వివాదానికి కారణమవుతున్న కాలాపని, లిపులేఖ్‌ల గురించి ప్రధాని మోదీతో మాట్లాడానని, సామరస్యంగా పరిష్కరించుకుందామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు ప్రచండ వెల్లడించారు. కాలాపని, లిపులేఖ్‌లను భారత్‌కు అప్పగిస్తే...దీనికి బదులుగా నేపాల్‌కు బంగ్లాదేశ్‌ ద్వారా సముద్ర మార్గం అందుబాటులోకి వచ్చేలా భూమిని ఇస్తామంటూ భారత నాయకత్వం ప్రతిపాదించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రచండ స్పందిస్తూ భూమి మార్పిడి అంశం అధికారికంగా చర్చకు రాలేదన్నారు. అయితే, వివిధ ప్రత్యామ్నాయాలు ప్రస్తావనకు వచ్చినట్లు నేపాల్‌ ప్రధాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని