భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
భారత్ అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అయినా భారతీయులు వీసాల కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వస్తోందనీ, దీన్ని సరిదిద్దడానికి బైడెన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఇద్దరు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యులు ఆ దేశ విదేశాంగ శాఖను ప్రశ్నించారు.
అమెరికా విదేశాంగ శాఖను ప్రశ్నించిన కాంగ్రెస్ సభ్యులు
వాషింగ్టన్: భారత్ అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అయినా భారతీయులు వీసాల కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వస్తోందనీ, దీన్ని సరిదిద్దడానికి బైడెన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఇద్దరు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యులు ఆ దేశ విదేశాంగ శాఖను ప్రశ్నించారు. అమెరికాకు వ్యాపారం లేదా పర్యాటకం కోసం వచ్చే భారతీయులు బీ1, బీ2 వీసాలు పొందడానికి 450 నుంచి 600 రోజులు వేచిఉండాల్సి వస్తోందని, ఈ తీవ్ర జాప్యం రెండు దేశాల వ్యాపార సంబంధాలను దెబ్బతీయవచ్చని సెనెట్ విదేశీ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు బాబ్ మెనెండెజ్ హెచ్చరించారు. ఆయన ఇండియా కాకస్ సహ అధ్యక్షుడు మైకేల్ వాల్ట్స్‌తో కలసి దౌత్య వ్యవహారాలపై రెండు వేర్వేరు కాంగ్రెస్ విచారణలలో పాల్గొన్నారు. భారత్ క్వాడ్ భాగస్వామి అనీ, రెండు దేశాల మధ్య వందల కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోందని కాంగ్రెస్ సభ్యుడు వాల్ట్స్ గుర్తుచేశారు. ఈ నెలలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు అధికార పర్యటన జరపబోతున్నారంటూ, వీసా నిరీక్షణ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారని ప్రశ్నించారు. శాసనకర్తల ప్రశ్నలకు సమాధానమిచ్చిన అమెరికా విదేశాంగ శాఖ (దౌత్య వ్యవహారాలు) సహాయ మంత్రి రీనా బటర్ ఈ ఏడాది భారతీయులకు 10 లక్షల వీసాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కొవిడ్ వల్ల దౌత్య కార్యాలయాల్లో పని కుంటుపడినా, ఇప్పుడు అదనపు ఏర్పాట్లతో వీసా దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.