భారతీయ విద్యార్థులపై బహిష్కరణ వేటు వద్దు

ఏజెంట్ల మాయలో చిక్కుకుని మోసపోయిన భారతీయ విద్యార్థులపై బహిష్కరణ వేటు వేయవద్దని కెనడా సరిహద్దు సేవల సంస్థ(సీబీఎస్‌ఏ)కు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ విజ్ఞప్తి చేసింది.

Updated : 09 Jun 2023 07:04 IST

నకిలీ అడ్మిషన్ల కుంభకోణంలో వాళ్లు బాధితులు
కెనడా సరిహద్దు సేవల సంస్థకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ విజ్ఞప్తి

టొరాంటో: ఏజెంట్ల మాయలో చిక్కుకుని మోసపోయిన భారతీయ విద్యార్థులపై బహిష్కరణ వేటు వేయవద్దని కెనడా సరిహద్దు సేవల సంస్థ(సీబీఎస్‌ఏ)కు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ విజ్ఞప్తి చేసింది. కమిటీలోని అధికార, విపక్ష సభ్యులందరూ బుధవారం ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదన చేశారు. మానవతా దృక్పథంతో వారందరికీ శాశ్వత నివాస హోదా కల్పించాలని, క్రమబద్ధీకరణ వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీ కోరింది. నకిలీ అడ్మిషన్‌ లెటర్లతో కెనడా వీసాలు పొందారని ఆరోపిస్తూ దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులకు దేశ బహిష్కరణ నోటీసులను గత మార్చిలో సీబీఎస్‌ఏ జారీ చేసింది. దీంతో విద్యార్థులను ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్లు మోసం చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతూ కెనడాలో నిరసనలకు దిగారు. ‘మేము 2018లో కెనడా వచ్చాం. అయిదేళ్ల తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోగా నకిలీ అడ్మిషన్‌ లెటర్ల విషయం తెలిసింది. ప్రస్తుత పరిస్థితి మా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంద’ని ఓ విద్యార్థి వాపోయారు. బాధితుల్లో అత్యధికులు పంజాబ్‌ నుంచి వెళ్లిన వారున్నారు.


సమస్య పరిష్కారానికి కృషి: కేంద్ర మంత్రి జైశంకర్‌

భారతీయ విద్యార్థుల ఆందోళనపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పందించారు. సమస్యను కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ, హైకమిషన్‌ కలిసి పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థులకు న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. పంజాబ్‌ ఎన్‌ఆర్‌ఐ మంత్రి కుల్దీప్‌ సింగ్‌ ధాలివాల్‌ రాసిన లేఖకు స్పందనగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు