కొర్రల జన్యుక్రమం ఆవిష్కరణ

తృణధాన్యాల్లో ముఖ్యమైన కొర్రల జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీని పరిణామక్రమం, జన్యు వివరాల వంటి వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.

Published : 10 Jun 2023 03:33 IST

దిల్లీ: తృణధాన్యాల్లో ముఖ్యమైన కొర్రల జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీని పరిణామక్రమం, జన్యు వివరాల వంటి వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. ఈ సమాచారం ఈ మొక్కల సాగుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, అమెరికాలోని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ చేశారు.

కొర్రలను మెట్ట ప్రాంతాలు సహా అనేక చోట్ల సాగు చేసే వీలుందని పరిశోధనలో పాలుపంచుకున్న మైఖేల్‌ పురుగ్గాన్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇది ఆహార భద్రతలో ముఖ్య పాత్ర పోషించగలదని వివరించారు. తొలినాటి చైనా నాగరికతకు కొర్రలు పునాదులు వేశాయి. ప్రపంచంలోనే మానవాళి సాగు చేసిన పురాతన పంటల్లో ఇదొకటి. దాదాపు 11వేల సంవత్సరాలుగా మనుషులు దీన్ని సాగు చేస్తున్నారు. కొర్రల్లో ప్రొటీన్లు పుష్కలం. ఈ పంట కరవును తట్టుకోగలదు. నేలలో పోషకాలు తక్కువగా ఉన్నా.. అది మనుగడ సాగించగలదు. దీనికి ప్రధాన కారణం.. ఈ మొక్కలో జరిగే అత్యంత సమర్థమైన సి4 కిరణజన్యసంయోగ క్రియే. ప్రపంచవ్యాప్తంగా 1,844 కొర్ర జాతి మొక్కలకు సంబంధించిన 110 జన్యుపటాలను గుదిగుచ్చడం ద్వారా ఒక సమగ్ర జన్యుపటాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీని భౌగోళిక పరిణామక్రమం, వృద్ధి తదితరాలకు సంబంధించిన నిర్దిష్ట జన్యువులనూ వారు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని