America - China: ‘సముద్ర గర్భంలో’ కేబుల్ యుద్ధం!
అంతర్జాతీయ వాణిజ్యం, సిలికాన్ చిప్స్, 5జీ టెక్నాలజీ, ఖనిజ గనులు, కృత్రిమ మేధ, అంతరిక్ష యానం, సముద్ర జలాలు...ఇలా ప్రతిరంగంలోనూ పోటీ పడుతున్న అమెరికా, చైనా ఆధిపత్య యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భంలోకీ చేరింది.
ఇంటర్నెట్‌పై పెత్తనానికి అమెరికా, చైనా పోటాపోటీ
అంతర్జాతీయ వాణిజ్యం, సిలికాన్ చిప్స్, 5జీ టెక్నాలజీ, ఖనిజ గనులు, కృత్రిమ మేధ, అంతరిక్ష యానం, సముద్ర జలాలు...ఇలా ప్రతిరంగంలోనూ పోటీ పడుతున్న అమెరికా, చైనా ఆధిపత్య యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భంలోకీ చేరింది. సమాచార విప్లవ వారధులైన సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై పెత్తనానికి ఈ రెండుదేశాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. సామదానభేద దండోపాయాలను ప్రయోగించిన అమెరికా... ఈ ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీలను తప్పించి తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవటంలో సఫలమైంది.
ఫోన్లు, వీడియో చాట్లు, ఈమెయిల్స్... ఇలా సమాచార విప్లవానికి కారణమై... ప్రపంచం కుగ్రామంగా మారటానికి మూలం ఇంటర్నెట్! ఆ ఇంటర్నెట్ సక్రమంగా పని చేస్తోందంటే సముద్ర గర్భంలో వేసిన కేబుల్ లైన్లు కారణం. అన్ని సముద్రాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 9లక్షల మైళ్ల ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95% డాటా అనుక్షణం ప్రసారమవుతుంటుంది. ఇప్పుడా కేబుల్ వ్యవస్థలే చైనా, అమెరికాల మధ్య సముద్రంలో మంటలు రేకెత్తించాయి. అమెరికా, చైనాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికీ ఆయుధాలవుతున్నాయి. చాలా కాలంగా ఈ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అమెరికా కంపెనీల చేతుల్లో సాగుతోంది. తాజాగా... చైనాకు చెందిన కన్సార్షియం రంగంలోకి దిగటంతో సమస్య మొదలైంది.
ఆ కంపెనీతోనే సమస్య!
ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాలను కలుపుతూ సింగపూర్ నుంచి ఫ్రాన్స్ దాకా సాగే సముద్ర గర్భ కేబుల్‌లైన్ వేయటానికి అమెరికాకు చెందిన సబ్‌కామ్ కన్సార్షియానికి చైనా కంపెనీ హెచ్‌ఎంఎన్ టెక్ కేబుల్ నెట్‌వర్క్స్ పోటీగా ముందుకొచ్చింది. హెచ్‌ఎంఎన్ కన్సార్షియంలో వివిధ దేశాల కంపెనీలతో పాటు చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉండటం వివాదానికి దారితీసింది. చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థగా పేర్కొంటూ... 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటులోనూ ఈ కంపెనీని అమెరికాతో పాటు అనేక ఐరోపా దేశాలు దూరం పెట్టాయి. సమాచారం అంతటినీ ఈ కంపెనీ చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందనేది ఆరోపణ. తాజాగా సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థపైనా హువావే రూపంలో చైనా ప్రభుత్వం నిఘా పెట్టబోతోందన్నది అమెరికా ఆరోపణ. ‘‘ఈ కేబుళ్ల ద్వారా ప్రసారమయ్యే డేటాను, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను, మిలిటరీ సమాచారాన్ని... చైనా ప్రభుత్వం గుప్పిట పెట్టుకునే ప్రమాదముంది. ఆప్టిక్ కేబుళ్లలోనే ఈ మేరకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది’’ అని అమెరికా రిపబ్లికన్ సెనెటర్ బ్రియన్ మస్ట్ ఆందోళన వ్యక్తంజేశారు. గతంలో కెనడాలో, ఆఫ్రికా దేశాల్లో చైనా కంపెనీ డేటా చౌర్యం గురించి అమెరికా ప్రస్తావిస్తోంది.
నయానో భయానో...
అమెరికా ప్రభుత్వం పరోక్షంగా రంగంలోకి దిగి కన్సార్షియంలోని కంపెనీలను దారిలోకి తేవటం మొదలెట్టింది. ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తేవటంతో కన్సార్షియంలోని వివిధ దేశాల కంపెనీలు మొత్తానికి అమెరికా కంపెనీ సబ్‌కామ్‌కు మొగ్గు చూపాయి. ప్రాజెక్టు సబ్‌కామ్‌కే దక్కింది. చైనా హెచ్‌ఎంఎన్ నెట్‌వర్క్స్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగింది. టెలికాం రంగంలో చైనా పెత్తనం లేకుండా అమెరికా ఎక్కడికక్కడ జాగ్రత్తపడుతోంది. చైనా కంపెనీలు సైబర్, టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా నిఘా వేస్తున్నాయనేది అనుమానం. అందుకోసమే...తమ దేశంతో నేరుగా సంబంధం లేకున్నా ఆసియా-ఐరోపా కేబుల్ వ్యవస్థ (సింగపూర్ నుంచి ఐరోపా కేబుల్ లైన్) గురించి అమెరికా పట్టుబట్టి మరీ చైనా కంపెనీని తప్పించిందన్నది నిపుణుల విశ్లేషణ. గతంలో అమెరికా కంపెనీలు చైనా టెలికాం పరికరాలు వాడటానికి వీలుండేది. 2021 తర్వాత నుంచి దేశ భద్రతకు ముప్పంటూ చైనా టెలికాం పరికరాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఉపసంహరించింది. అంతేగాకుండా చైనా టెలికాం కంపెనీలు అమెరికా గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం విధించింది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన