‘క్యాన్సర్‌పై పోరుకు’ దారి చూపిన మైటోకాండ్రియా

క్యాన్సర్‌పై పోరుకు ఉపయోగపడే సమర్థ సాధనం ఇమ్యునోథెరపీ! రోగి స్వీయ రోగ నిరోధక వ్యవస్థను యుక్తిగా వాడుకుంటూ కణితి కణాలను నిర్మూలించడం ఇందులో కీలకం.

Published : 24 Sep 2023 06:01 IST

క్యాన్సర్‌పై పోరుకు ఉపయోగపడే సమర్థ సాధనం ఇమ్యునోథెరపీ! రోగి స్వీయ రోగ నిరోధక వ్యవస్థను యుక్తిగా వాడుకుంటూ కణితి కణాలను నిర్మూలించడం ఇందులో కీలకం. అయితే కొందరిపై ఇది ఫలించడంలేదు. ఈ నేపథ్యంలో ఇమ్యునోథెరపీని మెరుగుపరచడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.  ఈ దిశగా అమెరికాలోని సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. కణంలోని మైటోకాండ్రియన్‌(బహువచనం మైటోకాండ్రియా)ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇది శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో తొలి అంచెలో మార్పులు చేయడం ద్వారా కణితి పరిమాణాన్ని తగ్గించొచ్చని తేల్చారు. రోగ నిరోధక వ్యవస్థ.. సులువుగా కణితులను గుర్తించగలిగేలా, ఇమ్యునోథెరపీకి మరింత సమర్థంగా స్పందించేలా చేసే ఒక విధానాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కణాల్లో ముఖ్యమైన భాగం మైటోకాండ్రియన్‌. కణంలోని జీవరసాయన చర్యలకు అవసరమైన శక్తిని అదే అందిస్తుంది. అందుకే దాన్ని ‘పవర్‌ హౌస్‌’గా పిలుస్తారు. క్యాన్సర్‌ కణాలు మైటోకాండ్రియాపై పెద్దగా ఆధారపడబోవని గతంలో భావించేవారు. అయితే కణితి ఎదుగుదలలో ఈ భాగం చాలా ముఖ్య పాత్రలను పోషిస్తుందని ఇటీవల వెల్లడైంది. అది రోగనిరోధక వ్యవస్థతోపాటు ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా కణితి కణాలు తమ శక్తి అవసరాలు, ఉత్పత్తి మధ్య సమతౌల్యాన్ని సాధిస్తుంటాయి. దీన్ని ‘మెటబోలిక్‌ దశ’గా పేర్కొంటారు. ఫలితంగా అవి వేగంగా ఎదిగే సామర్థ్యాన్ని సాధించడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకోగలుగుతాయి. ఈ నేపథ్యంలో.. అటు కణితి వృద్ధిని ఇటు రోగనిరోధక వ్యవస్థ స్పందన తీరును మైటోకాండ్రియన్‌ ఎలా ప్రభావితం చేస్తుందన్నది పరిశీలించడానికి సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఈ క్రమంలో వారు ఎలక్ట్రాన్‌ బట్వాడా శృంఖలంపై దృష్టిసారించారు. ఈ ప్రక్రియలో ఎలక్ట్రాన్లు మైటోకాండ్రియా గుండా పయనిస్తాయి. ఫలితంగా శక్తి సరఫరా అణువులైన అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ఏటీపీ) ఉత్పత్తి జరుగుతుంది. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ ఎలక్ట్రాన్‌ రవాణా శృంఖలంలో ఒక కీలక అంచెలో మార్పులు చేపట్టారు.


ఎలా చేశారంటే..

  • ఏటీపీ ఉత్పత్తి కోసం మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్లు రెండు మార్గాల్లో పయనిస్తాయి. అలా కాకుండా ప్రధానంగా ఒకే మార్గం గుండా ఈ పయనం సాగేలా శాస్త్రవేత్తలు కొన్ని మార్పులు చేశారు.
  • దీనివల్ల సక్సినేట్‌ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తయింది. ఫలితంగా కణ కేంద్రకంలో రోగనిరోధకతకు సంబంధించిన జన్యువులు క్రియాశీలమయ్యాయి. ఇదే క్రమంలో కణితి ఉపరితలంపై ఎంహెచ్‌సీ అనే ప్రొటీన్‌ పరిమాణం కూడా పెరిగింది.
  • ఎంహెచ్‌సీ పెరుగుదల వల్ల కణితి కణాలు.. రోగనిరోధక వ్యవస్థలోని ‘హంతక’ టి కణాల దృష్టిలో ఎక్కువగా పడుతున్నాయి. క్యాన్సర్‌ కణాలు కంటపడితే వాటిని చంపేసే సామర్థ్యం వీటికి ఉంది.
  • రోగనిరోధక వ్యవస్థ కంటపడకుండా తప్పించుకుంటున్న  కణితి గుట్టురట్టు చేసి, దాన్ని దుర్బలంగా మార్చడానికి ఈ విధానం పనికొస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
  •  
  • మైటోకాండ్రియాకు హాని కలిగించకుండా క్యాన్సర్‌పై పోరుకు ఈ విధానాన్ని వినియోగించాల్సిన తీరుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు