సోమాలియాలో పేలుడు.. 18 మంది మృతి

మధ్య సోమాలియాలోని బెలెడ్‌వెయిన్‌ నగర భద్రతా చెక్‌పోస్టు వద్ద శనివారం పేలుడు పదార్థాలతో ఉన్న ఓ వాహనం దూసుకువచ్చి పేలిపోవడంతో 18 మంది మృతిచెందగా, 40 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Updated : 24 Sep 2023 06:29 IST

క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమం

మొగదిషు: మధ్య సోమాలియాలోని బెలెడ్‌వెయిన్‌ నగర భద్రతా చెక్‌పోస్టు వద్ద శనివారం పేలుడు పదార్థాలతో ఉన్న ఓ వాహనం దూసుకువచ్చి పేలిపోవడంతో 18 మంది మృతిచెందగా, 40 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వీరిని వాయుమార్గంలో మొగదిషుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో  అల్‌ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న అల్‌ షబాబ్‌ తీవ్రవాదులపై సోమాలియా ప్రభుత్వం ఇటీవలే ఈ ప్రాంతంలో సైనిక దాడికి దిగింది. అయితే, తాజా పేలుడుకు బాధ్యత వహిస్తూ అల్‌ షబాబ్‌ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.


క్రిమియాపై మరోసారి ఉక్రెయిన్‌ దాడి

కీవ్‌: సెవాస్తపోల్‌ నగరంలోని రష్యా నల్ల సముద్ర నౌకా దళ ప్రధాన కార్యాలయంపై శుక్రవారం యుద్ధ విమానాలతో దాడి చేసిన ఉక్రెయిన్‌ తాజాగా అదే నగరంపై క్షిపణులతో దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌ నుంచి 2014లో రష్యా కైవసం చేసుకున్న క్రిమియాలో సెవాస్తపోల్‌ నగరం ఉంది. శుక్రవారం జరిపిన దాడిలో నల్లసముద్ర నౌకా దళ సభ్యుడొకరు కనిపించకుండా పోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్కడ తమ విమానాలు 12 సార్లు దాడులు జరిపాయని, రష్యన్‌ ఫిరంగి, విమాన విధ్వంసక వ్యవస్థలను దెబ్బతీశాయని ఉక్రెయిన్‌ తెలిపింది.


కామపిశాచి తండ్రిని చంపిన పాక్‌ బాలిక

లాహోర్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో శనివారం పద్నాలుగేళ్ల బాలిక తన తండ్రిని తుపాకితో కాల్చి చంపింది. కామపిశాచి అయిన తండ్రి గత మూడు నెలలుగా ఆ బాలికపై అత్యాచారాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాహోర్‌లోని గుజ్జర్‌పుర ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని