చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాగ్రత్త: నిక్కీహేలీ

‘అమెరికాకే కాదు ప్రపంచం మొత్తానికి చైనా పెద్ద ముప్పుగా ఉంది. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 24 Sep 2023 05:38 IST

వాషింగ్టన్‌: ‘అమెరికాకే కాదు ప్రపంచం మొత్తానికి చైనా పెద్ద ముప్పుగా ఉంది. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం న్యూహ్యాంప్‌షైర్‌లో ఆర్థిక వ్యవస్థ విధివిధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్ల నుంచి పన్నాగాలు పన్నుతోంది. కొన్ని విషయాల్లో ఆ దేశ సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమానంగా ఉంది. మన దేశ మనుగడకు, కమ్యూనిస్టు చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం అవసరం. చైనా మన వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోంది’ అని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకుంటూ..‘మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి కృషి చేస్తా. ఫెడరల్‌ గ్యాస్‌, డీజిల్‌ పన్ను, శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గిస్తా. బైడెన్‌ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్‌ డాలర్ల హరిత ఇంధన రాయితీలనూ తొలగిస్తా. దీంతో శత్రుదేశానికి మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయి. రాజకీయ నాయకులే కాదు.. ప్రభుత్వ అధికారులు కూడా అయిదేళ్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదు. కాలపరిమితిని అమలు చేయడం వల్ల వారు మంచి ప్రజా సేవకులుగా పనిచేస్తారు. అంతేకాకుండా మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే రాజకీయాలకు దూరంగా ఉంటారు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని