భారత్‌ పర్యటనలో జాగ్రత్త

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఏకంగా హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్‌ సైనికుడిని పార్లమెంట్‌ సాక్షిగా గౌరవించి కలకలం సృష్టించింది.

Updated : 26 Sep 2023 06:18 IST

తమ దేశ పౌరులకు  కెనడా మళ్లీ హెచ్చరిక

టొరంటో: అత్యవసరమైతే తప్ప భారత పర్యటన చేయొద్దని తమ దేశ పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన కెనడా సోమవారం మరోసారి ప్రయాణ సలహాను జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, కొందరు ఆందోళనలకూ పిలుపునిస్తున్నారని.. కాబట్టి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచించింది. ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

నాజీలపై ట్రూడో ప్రేమ

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఏకంగా హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్‌ సైనికుడిని పార్లమెంట్‌ సాక్షిగా గౌరవించి కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ ఆంటోని రోటా ఆ తర్వాత తీరిగ్గా యూదులకు క్షమాపణలు చెప్పారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు ట్రూడో వ్యవహారశైలిపై మండిపడుతున్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల తొలిసారి కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్‌ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అతడికి జెలెన్‌స్కీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. కెనడాలోని ‘ది ఫ్రెండ్స్‌ ఆఫ్‌ సైమన్‌ వెసింతల్‌ సెంటర్‌’ ప్రతినిధులు పార్లమెంట్‌ చర్యను ఖండించారు. హంకా చేతులు యూదుల రక్తంతో తడిశాయని పేర్కొన్నారు. మరో వైపు ప్రధాని జస్టిన్‌ ట్రూడో కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. జరిగిన పొరపాటుకు స్పీకర్‌ క్షమాపణలు చెప్పారని పేర్కొంది. కెనడా స్పీకర్‌ చర్యను రష్యా తీవ్రంగా గర్హించింది.


హిందువులకు బెదిరింపులు.. ఆలయాలపైనా దాడులు

దిల్లీ: కెనడాలో ఖలిస్థాన్‌ సానుభూతి పరుల అరాచకాలు గత కొంత కాలంగా భారీగా పెరిగాయని భారత ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఈ అరాచకవాదులు..బహిరంగంగానే కెనడాలోని మైనారిటీ హిందువులను బెదిరిస్తున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. మన దేశ దౌత్యవేత్తల భద్రతకు ముప్పుగా పరిణమించారు. పంజాబ్‌లో ఏ చిన్న విషయం జరిగినా కెనడా నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు. వీరిలో చాలా మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో చురుగ్గా ఉన్నారు. అయినా అక్కడి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది రెండు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో జరిగిన నిఘా వర్గాల ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. ‘‘అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఖలిస్థాన్‌ అనుకూలురు రెచ్చిపోతున్నారు. ఆధునిక భావాలు ఉన్న భారత్‌ అనుకూల సిక్కులను గురుద్వారాల నుంచి గెంటివేస్తున్నారు. పంజాబ్‌లోనూ హింసను వీరు ప్రేరేపిస్తున్నారు’’ అని ఆ సీనియర్‌ అధికారి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని