మరో మహమ్మారి పొంచి ఉంది

ప్రపంచానికి డిసీజ్‌ ఎక్స్‌ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్‌ ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డేమ్‌ కేట్‌ బింగ్‌హామ్‌ చెప్పారని డైలీ మెయిల్‌ ఒక కథనాన్ని పేర్కొంది.

Published : 26 Sep 2023 05:23 IST

బ్రిటన్‌ శాస్త్రవేత్తల వెల్లడి

లండన్‌: ప్రపంచానికి డిసీజ్‌ ఎక్స్‌ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్‌ ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డేమ్‌ కేట్‌ బింగ్‌హామ్‌ చెప్పారని డైలీ మెయిల్‌ ఒక కథనాన్ని పేర్కొంది. కరోనా మహమ్మారి కంటే డిసీజ్‌ ఎక్స్‌ ప్రజలపై 7 రెట్ల అధిక ప్రభావం చూపిస్తుందని డేమ్‌ కేట్‌ వెల్లడించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మరో కొత్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎంతో కాలంగా సూచిస్తూనే ఉంది. ‘ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. వాటన్నింటినీ మానవాళికి ముప్పుగా భావించలేం. కానీ వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. వేలకొద్ది వైరస్‌లున్న 25 వైరస్‌ కుటుంబాలను శాస్త్రవేత్తలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఏదైనా వైరస్‌ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చు. అయితే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వైరస్‌లు ఈ జాబితాలో లేవు. కరోనా మహమ్మారి సోకిన వారిలో ఎక్కువ మంది వైరస్‌ బారి నుంచి బయటపడగలిగారు. కానీ డిసీజ్‌ ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిపై ప్రభావం చూపిస్తుంది’ అని డేమ్‌ కేట్‌ అభిప్రాయపడ్డారు. డిసీజ్‌ ఎక్స్‌ను ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సుమారు 200 మంది శాస్త్రవేత్తలు విల్ట్‌షైర్‌లోని పోర్ట్‌డౌన్‌ ప్రయోగశాలలో జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపించే వైరస్‌లను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు