ఒడెసా పోర్టులో స్తంభించిన నౌకా సేవలు

ఉక్రెయిన్‌లో కీలకమైన ఒడెసా ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్‌ దాడులు నల్లసముద్ర ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాడుల్లో ఓ గోదాము ధ్వంసం కాగా డజన్ల కొద్దీ ట్రక్కులు మంటల్లో చిక్కుకున్నాయి.

Published : 27 Sep 2023 05:08 IST

రష్యా క్షిపణి దాడులే కారణం

కీవ్‌: ఉక్రెయిన్‌లో కీలకమైన ఒడెసా ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్‌ దాడులు నల్లసముద్ర ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాడుల్లో ఓ గోదాము ధ్వంసం కాగా డజన్ల కొద్దీ ట్రక్కులు మంటల్లో చిక్కుకున్నాయి. పేలుడు పదార్థాల కారణంగా ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ఈ కారణంగా ఉక్రెయిన్‌, రొమేనియా మధ్య ప్రయాణికుల నౌకా(ఫెర్రీ) సేవలు నిలిచిపోయినట్లు మంగళవారం ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా రొమేనియాలోని డాన్యూబ్‌ తీరంలోని ఇసాక్సియాలో ఫెర్రీలు నిలిచిపోయినట్లు స్థానిక సరిహద్దు పోలీసు ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డాన్యూబ్‌ నదీ తీరానికి ఎగువన ఉన్న రొమేనియా పట్టణం గలాటి మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించినట్లు వివరించారు. రష్యా ప్రయోగించిన మొత్తం 38 డ్రోన్లలో 26 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళం వెల్లడించింది. ఒడిసా ప్రాంతంలో ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాల ఎగుమతికి కీలకంగా ఉన్న ఇజ్‌మైల్‌ను రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలో రొమేనియా వైపు నుంచి చిత్రీకరించిన ఓ వీడియోలో ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ సోమవారం రాత్రి రష్యా డ్రోన్లను పేల్చివేస్తున్న దృశ్యాలు కనిపించాయి. మరోపక్క రెండు నారింజ రంగు అగ్నిగోళాలు నౌకాశ్రయ సమీప ప్రాంతాన్ని పేల్చివేస్తున్నట్లు అగుపించింది. ఇంకోపక్క తాము నిర్వహించిన క్షిపణి దాడిలో మరణించాడని ఉక్రెయిన్‌ సోమవారం పేర్కొన్న రష్యా నౌకాదళాధికారి ఓ ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్నట్లు కనిపిస్తున్న మరో వీడియో ఒకటి బయటపడటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు