మలేరియాపై మరో టీకాస్త్రం

ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడగల సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం ఆమోద ముద్ర వేసింది.

Published : 03 Oct 2023 03:12 IST

లండన్‌: ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడగల సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం ఆమోద ముద్ర వేసింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సాయంతో ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మలేరియా నుంచి ఇది 75% పైగా రక్షణ కల్పించగలదని పరిశోధకులు తెలిపారు. ఇది మూడు డోసుల టీకా. బూస్టర్‌ కూడా వేసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మలేరియా బారిన పడే ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు దానికి ఆమోద ముద్ర వేసినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసస్‌ తెలిపారు. ఘనా, బుర్కినాఫాసోలో అధికారవర్గాలు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఆమోదించాయి. మలేరియా నివారణకు ఉపయోగపడే ‘మస్కిరిక్స్‌’ అనే టీకాకు (జీఎస్‌కే గ్రూప్‌ తయారుచేసింది) డబ్ల్యూహెచ్‌వో 2021లోనే ఆమోదముద్ర వేసింది. అది 30% మాత్రమే రక్షణ కల్పించగలదు. 4డోసుల ఆ వ్యాక్సిన్‌ ప్రభావం కొన్ని నెలల్లోనే తగ్గిపోతుంది. దానితో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్‌-ఎస్‌ఐఐ టీకా ప్రభావశీలత ఎక్కువ. తక్కువ ధరకే లభిస్తుంది కూడా. దాని రేటు 2-4 డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు