ముగిసిన ప్రపంచ సాంస్కృతిక వేడుక

శ్రీశ్రీ రవిశంకర్‌ స్ఫూర్తితో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌లో నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి.

Updated : 03 Oct 2023 06:17 IST

వాషింగ్టన్‌: శ్రీశ్రీ రవిశంకర్‌ స్ఫూర్తితో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌లో నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల నుంచి ఉత్సాహభరిత ప్రదర్శనలు, ప్రపంచ శాంతి కోసం చేసిన సర్వమత ప్రార్థనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ద్వేషం, మతోన్మాదానికి అతీతంగా ఎదగాలని వివిధ మతాల ఆధ్యాత్మిక వేత్తలు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల నుంచి 10 లక్షల మందికిపైగా ప్రజలు ప్రత్యక్షంగా, వర్చువల్‌గా హాజరై నృత్యం, సంగీతం, ధ్యానం, సంస్కృతుల ద్వారా మానవాళి సమైక్యతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలిగారు. మానవీయ బంధాలను, సమైక్య భావనను, స్ఫూర్తిని పెంపొందించే మధురమైన జ్ఞాపకాలను ఆహుతులకు పంచుతూ ఈ ఉత్సవం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.  ప్రపంచ వ్యాప్తంగా 17,000 మంది కళాకారులను ఒకచోట చేర్చింది. భిన్న సంస్కృతీ సంప్రదాయాలను సూచించే 60కి పైగా ప్రదర్శనలు జరిగాయి.

‘మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా మంచితనం ఉంది. అది పైకి రావాలి. మనమంతా ఒకే ప్రపంచ కుటుంబమని గ్రహించినప్పుడు అది తప్పక బయటకు వస్తుంది’ అని శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు. విశేషమైన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ ఉత్సవాల్లో ‘పంచభూతం’ పేరిట 5 భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలైన భరత నాట్యం, కథక్‌, ఒడిస్సీ, కూచిపూడి, మోహినియట్టంలను ప్రదర్శించారు. 250 మంది సితార్‌, వీణ, తబలా, మృదంగం, వేణువు, వయోలిన్‌ విద్వాంసుల సామూహిక వాద్య గోష్ఠి, 10,000 మంది కళాకారులచే ఉత్సాహభరితమైన గర్భా నృత్య ప్రదర్శన, 200 మంది కళాకారులతో భాంగ్రా నృత్యం, కశ్మీరీ జానపద నృత్యం, 200 మంది కళాకారులచే ‘చెండ’ డోలువాద్య విన్యాసం ప్రేక్షకులను అలరించాయి. ఈ ఉత్సవాలకు హాజరైన ప్రముఖుల్లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌, అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని