హత్యచేసి.. బతికుందని నమ్మించాడు

నేరాలను దర్యాప్తు చేసిన అనుభవమో ఏమోగానీ.. ఓ పోలీసే స్వయంగా హత్య చేసి రెండేళ్లు చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు.

Published : 03 Oct 2023 04:08 IST

దిల్లీలో ఓ పోలీసు దురాగతం

దిల్లీ: నేరాలను దర్యాప్తు చేసిన అనుభవమో ఏమోగానీ.. ఓ పోలీసే స్వయంగా హత్య చేసి రెండేళ్లు చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సురేంద్ర రాణా (42) దిల్లీ పోలీసు విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన మోనా అనే యువతితో అతనికి పరిచయం ఉంది. కానిస్టేబుల్‌గా ఉంటూనే ఎస్‌ఐ ఉద్యోగం సాధించిన ఆమె.. కొత్త ఉద్యోగంలో చేరలేదు. కానిస్టేబుల్‌ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యేది. మరోవైపు, సురేంద్ర ఆమె వెంటబడేవాడు. మోనా మాత్రం తరచూ అతణ్ని వారించేది. ఈ క్రమంలో 2021 సెప్టెంబరు 8న వీరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ఆమెను సురేంద్ర ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని మురుగు కాల్వలో పడేశాడు. పైకి తేలకుండా శవంపై పెద్ద బండరాళ్లను పెట్టాడు.

కరోనా టీకా సర్టిఫికెట్‌ను సృష్టించి కట్టుకథ..

మోనాను చంపేసిన తర్వాత సురేంద్ర చిన్నగా కట్టుకథ అల్లడం ప్రారంభించాడు. బాధితురాలి కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి అర్వింద్‌ అనే వ్యక్తితో ఆమె వెళ్లిపోయినట్లు తెలిపాడు. మోనా కోసం తాను గాలిస్తున్నట్లు వారిని నమ్మించాడు. వారితో కలిసి పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లాడు. ఆమె బతికే ఉన్నట్లు నమ్మించడం కోసం.. కరోనా టీకా సర్టిఫికెట్‌ పుట్టించాడు. మోనా బ్యాంకు ఖాతా నుంచి తరచూ లావాదేవీలు జరిపాడు. సిమ్‌ కార్డును కూడా ఉపయోగించాడు. అక్కడితో ఆగకుండా తన బావమరిది  రాబిన్‌నూ ఇందులోకి దింపాడు. అతనితో అర్వింద్‌లా మాట్లాడిస్తూ ఆ కుటుంబాన్ని ఏమార్చే ప్రయత్నం చేశాడు. మధ్య మధ్యలో సురేంద్ర తన వద్ద ఉన్న మోనా ఆడియో రికార్డింగులను ఎడిట్‌ చేసి కుటుంబసభ్యులకు పంపేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఈ కేసు దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు చేరింది. వారు అర్వింద్‌ పేరిట రాబిన్‌ చేస్తున్న ఫోన్‌ నంబరును ట్రేస్‌ చేయడంతో కొన్ని ఆధారాలు లభించాయి. వాటిని లోతుగా విచారించడంతో అసలు గుట్టు రట్టయ్యింది. సురేంద్రకు భార్య, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మోనా.. ఉన్నతస్థాయి అధికారిణి అవుతుందనే నమ్మకంతో ఆమె వెంట పడ్డాడు. కానీ, ఆమె అతణ్ని తండ్రిగా భావించానని చెప్పడంతో ఆగ్రహానికి గురై దారుణానికి ఒడిగట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని