జాబిల్లిపైకి పాక్‌ పేలోడ్‌.. మోసుకెళ్లనున్న చైనా రాకెట్‌

చంద్రుడి ఆవలి వైపునకు 2024లో చైనా ప్రయోగించే చాంగే-6 రాకెట్‌ పాకిస్థాన్‌కు చెందిన క్యూబ్‌ శాట్‌ సూక్ష్మ పేలోడ్‌నూ మోసుకెళ్లనుంది.

Published : 03 Oct 2023 04:08 IST

బీజింగ్‌: చంద్రుడి ఆవలి వైపునకు 2024లో చైనా ప్రయోగించే చాంగే-6 రాకెట్‌ పాకిస్థాన్‌కు చెందిన క్యూబ్‌ శాట్‌ సూక్ష్మ పేలోడ్‌నూ మోసుకెళ్లనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రాడాన్‌ డిటెక్టర్‌ పరికరం, ఇటలీకి చెందిన లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ నూ, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కి చెందిన నెగెటివ్‌ అయాన్‌ డిటెక్టర్‌ను కూడా అది తీసుకెళ్లనుంది. భూమి నుంచి చంద్రుడు ఒకవైపే కనిపిస్తాడు. రెండోవైపు నిత్యం చీకటిలో ఉంటుంది. మానవులు ఇంతవరకు మనకు కనిపించే చంద్రోపరితలం నుంచి 10 సార్లు రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చారు. ప్రప్రథమంగా చంద్రుని రెండోవైపున దక్షిణ ధ్రువం-ఐట్కెన్‌ ప్రాంతం నుంచి నమూనాలను తీసుకురావడానికి చైనా చాంగే-6ను ప్రయోగిస్తోంది. ఈ యాత్రలో తన చిరకాల మిత్రదేశం పాకిస్థాన్‌కు భాగస్వామ్యం కల్పిస్తోంది. కక్ష్యలో తిరుగుతున్న చైనా అంతరిక్ష స్టేషన్‌ తియాంగాంగ్‌కు పాకిస్థాన్‌ ఈ ఏడాది మొదట్లో కొన్ని విత్తనాలను పంపి ప్రయోగాలు చేసింది. ఆ అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగామినీ పంపాలనీ, దక్షిణ ధ్రువం వద్ద చైనా ఏర్పాటుచేసే స్థావరంలో పాలుపంచుకోవాలనీ పాక్‌ ఆకాంక్షిస్తోంది. చంద్రుని రెండోవైపు నుంచి భూమికి కమ్యూనికేషన్‌ సంబంధాలు నెలకొల్పడానికి 2024 ప్రథమార్దంలో క్యూకియావో అనే రిలే ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని