ఆస్తులపై దొంగ లెక్కలు

ఆస్తులపై దొంగ లెక్కలు చెప్పడంద్వారా బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై న్యూయార్క్‌ కోర్టులో సోమవారం విచారణ జరిగింది.

Updated : 03 Oct 2023 04:24 IST

ఆర్థిక సంస్థలను మోసం చేసిన ట్రంప్‌
న్యూయార్క్‌ కోర్టులో విచారణ
రాజకీయ కుట్రన్న మాజీ అధ్యక్షుడు

దిల్లీ: ఆస్తులపై దొంగ లెక్కలు చెప్పడంద్వారా బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై న్యూయార్క్‌ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ట్రంప్‌ హాజరయ్యారు. అటార్నీ జనరల్‌ లెతీతియా జేమ్స్‌ వేసిన ఈ కేసులో మోసానికి ట్రంపే కారణమని న్యాయవాదులు ఆరోపించారు. ‘ట్రంప్‌ తన ఆదాయ వ్యయ వివరాలను తప్పుగా చూపారు. ఏటికేడు అబద్ధాలను చెబుతూ వచ్చారు’ అని అటార్నీ కార్యాలయ న్యాయవాది కెవిన్‌ వాలెస్‌ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను డిఫెన్స్‌ న్యాయవాదులతో కలిసి కూర్చున్న ట్రంప్‌ ఖండించారు. ‘ఇది రాజకీయ కుట్ర. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఎన్నికల్లో నన్ను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం. దేశ ప్రజలు దీనిని నమ్ముతారని అనుకోవడం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ వ్యాపారంలో మోసానికి పాల్పడ్డారని ఈ కేసులో గత వారమే న్యాయమూర్తి ఆర్థర్‌ ఎంగోరోన్‌ రూలింగ్‌ ఇచ్చారు. పై కోర్టులో అప్పీల్‌లోనూ ఈ రూలింగ్‌ను సమర్థిస్తే ట్రంప్‌ న్యూయార్క్‌లోని తన ఆస్తులను వదులుకోవాల్సి ఉంటుంది. అందులో ట్రంప్‌ టవర్‌, వాల్‌స్ట్రీట్‌ కార్యాలయ భవనం, గోల్ఫ్‌ కోర్సులు, సబర్బన్‌ ఎస్టేట్‌ ఉన్నాయి. అయితే దీనిని కార్పొరేట్‌ మరణ శిక్షగా ట్రంప్‌ అభివర్ణించారు. న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు ఇంకో 6 అంశాలపైనా న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 25 కోట్ల అమెరికా డాలర్ల జరిమానాతోపాటు న్యూయార్క్‌లో వ్యాపారం చేయకుండా ట్రంప్‌పై నిషేధం విధించాలని అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోరుతున్నారు. ట్రంప్‌ తన ఆస్తులను మరీ ఎక్కువ చేసి 3.6 బిలియన్‌ డాలర్లుగా చూపారని ఆమె తెలిపారు. మన్‌హట్టన్‌లోని మూడంతస్థుల పెంట్‌ హౌస్‌లో బంగారు పరికరాలను అమర్చానని చెప్పి 327 మిలియన్‌ డాలర్లుగా చూపించారని, న్యూయార్క్‌లో ఇంతవరకూ ఏ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ అంత ధరకు అమ్ముడుపోలేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని