కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం

ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది.

Updated : 12 Jun 2024 06:25 IST

తక్షణం అమలు చేయాలని ఇజ్రాయెల్, హమాస్‌కు పిలుపు

ఐరాస: ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు సమర్థించాయి. రష్యా మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరైంది. మూడు దశలతోకూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్‌లు తక్షణం అమలు చేయాలని ఈ తీర్మానం కోరింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఈ ప్రణాళికను గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు, యుద్ధానంతరం గాజా పాలనకు సంబంధించిన ప్రణాళికలకు మద్దతు కూడగట్టే ఉద్దేశంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. కాల్పుల విరమణ ప్రతిపాదన పట్ల ఆయన సానుకూలంగా ఉన్నట్లు బ్లింకెన్‌ చెప్పారు. హమాస్‌ నుంచి దీనిపై స్పందన రావాల్సి ఉందన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ ఆమోదం ఉందని అమెరికా చెబుతున్నప్పటికీ అందులోని కీలక అంశాలను నెతన్యాహు బహిరంగంగానే వ్యతిరేకించారు. హమాస్‌ను అంతమొందించడానికే తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సంధి ప్రయత్నాలపై హమాస్‌ నుంచి అధికారిక స్పందన రాలేదు. భద్రతా మండలి తాజా తీర్మానాన్ని ఆ ముఠా స్వాగతించింది.  కాల్పుల విరమణ అమలవుతుందన్న భరోసా తమకు ఉండాలని స్పష్టంచేసింది. కొన్ని అంశాలపై స్పష్టత కావాలని, ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని పేర్కొంది.  

  • అమెరికా-ఇజ్రాయెలీ గూఢచర్య నెట్‌వర్క్‌ను తాము భగ్నం చేసినట్లు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. కొద్దిరోజుల కిందట ఐరాస సిబ్బంది, దాతృత్వ సంస్థల సిబ్బందిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.  
  • దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఒక పేలుడులో నలుగురు ఇజ్రాయెల్‌ సైనికులు చనిపోయారు. 2006లో ఇజ్రాయెల్‌ సైనికుడు గిలాద్‌ షాలిత్‌ అపహరణలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఓ భవనంలో ఉన్నాడన్న సమాచారంతో దాని పేల్చివేతకు నెతన్యాహు సేన సిద్ధమైంది. వారి వద్ద ఉన్న పేలుడు పదార్థాలు ముందుగానే పేలడంతో నలుగురు సైనికులు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు.

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పాలస్తీనియులకు సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు