గాయపడిన విమాన ప్రయాణికులకు నష్టపరిహారం

గత నెలలో లండన్‌ నుంచి సింగపూర్‌ వస్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గాలిలో పెద్ద కుదుపునకు లోనవడంతో అందులోని 211 మంది ప్రయాణికులలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు.

Published : 12 Jun 2024 06:09 IST

 సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయం

సింగపూర్‌: గత నెలలో లండన్‌ నుంచి సింగపూర్‌ వస్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గాలిలో పెద్ద కుదుపునకు లోనవడంతో అందులోని 211 మంది ప్రయాణికులలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. దీంతో ప్రయాణికులందరికీ నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించడంతోపాటు విమాన టికెట్‌ చార్జీలను పూర్తిగా వెనక్కి ఇవ్వాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ మంగళవారం నిర్ణయించింది. మే 21న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గాలిలో మార్పుల వల్ల కుదుపునకు లోనవడంతో దారిలో బ్యాంకాక్‌ విమానాశ్రయంలోనే దిగిపోయింది. విమానంలో ముగ్గురు భారతీయులు సహా 211 మంది ప్రయాణికులతోపాటు 18 మంది సిబ్బంది కూడా ఉన్నారు. గాలిలో మార్పుల వల్ల ప్రయాణికులంతా సీట్లలో నుంచి లేచి విమానం పైకప్పును ఢీకొని కిందపడ్డారు. ఈ ఘటనలో చిన్న చిన్న గాయాలైనవారికి 10,000 డాలర్ల చొప్పున, పెద్ద గాయాలై దీర్ఘకాల చికిత్స అవసరమైనవారికి 25,000 డాలర్ల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని సోమవారం ప్రయాణికులకు సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ సమాచారం పంపింది. గాయాలైనా కాకపోయినా అందరికీ విమాన ఛార్జీలను వెనక్కి ఇస్తామని ప్రకటించింది. 18 మంది విమాన సిబ్బందికి నష్టపరిహారం ఇస్తారా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. ప్రమాదంలో మరణించిన బ్రిటిష్‌ ప్రయాణికుడు గుండెపోటు వల్ల కన్నుమూసినట్లు తెలుస్తోంది. మిగతావారికి తల, వెన్నెముకలకు గాయాలయ్యాయి. కొందరికి పక్కటెముకలు విరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని